ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన 8వ వేతన సంఘం జనవరి 1, 2026 నుండి అమలులోకి రానుంది. దీంతో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. 1.8-2.86 మధ్య ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 7వ వేతన సంఘం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57గా ప్రకటించగా.. కనీస మూల వేతనం రూ.7,440 నుంచి రూ.18 వేలకు పెరిగింది. ఇప్పుడు ఒకవేళ ఫిట్‌మెంట్ 2.15గా ప్రకటిస్తే రూ.18 వేల బేసిక్ శాలరీ ఉన్న వారికి రూ.38,700కు పెరిగే ఛాన్స్ ఉంది.
8వ వేతన సంఘం ప్రస్తుతం పనిచేస్తున్న, పదవీ విరమణ చేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లు, అలవెన్సులు మరియు జీతాలను సవరిస్తుంది . జీతాల పెంపుదలతో పాటు, ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని కమిషన్ డియర్‌నెస్ అలవెన్స్ (DA)ను కూడా సర్దుబాటు చేస్తుంది. రక్షణ సిబ్బందితో సహా దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ పదవీ విరమణ చేసిన వారితో సహా దాదాపు 65 లక్షల మంది రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు ఉన్నారని గతంలో ఓ నివేదిక పేర్కొంది.
ఎవరి జీతాల పెరుగుదల ఎక్కువగా ఉంటుంది?
కొత్త వేతన సంఘం అమలులోకి వచ్చిన తర్వాత, అన్ని ఉద్యోగులు మరియు పెన్షనర్ల మూల జీతం గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు. 8వ వేతన సంఘం జీతాల పెంపుదల ఉద్యోగి నుండి ఉద్యోగికి వారి స్థాయిని బట్టి మారుతుందని భావిస్తున్నారు.