80 దాటిన మరణాలు.. తొక్కిసలాట జరగడానికి కారణం అదే..!
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో మంగళవారం జరిగిన "సత్సంగ్"లో తొక్కిసలాట కారణంగా 80 మందికి పైగా మరణించారు.
By Medi Samrat Published on 2 July 2024 7:00 PM ISTఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో మంగళవారం జరిగిన "సత్సంగ్"లో తొక్కిసలాట కారణంగా 80 మందికి పైగా మరణించారు. మృతుల్లో పలువురు మహిళలు, చిన్నారులు ఉన్నారు. మృతులను హత్రాస్, పొరుగున ఉన్న ఎటా జిల్లాలో ఉన్న ఆసుపత్రులకు తరలించారు. హత్రాస్ జిల్లా మేజిస్ట్రేట్ ఆశిష్ జిల్లాలో దాదాపు 60 మంది మరణించినట్లు ధృవీకరించగా, ఎటా అధికారులు మరో 27 మరణాలు నమోదయ్యాయని తెలిపారు.
ఘటన జరిగిన వివాదంపై సీనియర్ పోలీసు అధికారి రాజేష్ కుమార్ సింగ్ మీడియాతో మాట్లాడారు. హత్రాస్ జిల్లాలోని ఒక గ్రామంలో జరుగుతున్న సత్సంగ్ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగిందని అన్నారు. రద్దీ కారణంగా తొక్కిసలాట జరిగినట్లు మరో పోలీసు అధికారి ధృవీకరించారు. కార్యక్రమం ముగియగానే ఒక్కసారిగా తొక్కిసలాట జరిగిందని అధికారులు తెలిపారు. దీని ఫలితంగా మహిళలు, పిల్లలు సహా 80 మందికి పైగా మరణించారు. మానవ్ మంగళ్ మిలన్ సద్భావనా సమాగం కమిటీ ఆధ్వర్యంలో సత్సంగ్ నిర్వహించారు. ఒక ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ, "మేము సత్సంగ్ కోసం వచ్చాము. అక్కడ పెద్ద జనసమూహం ఉంది. సత్సంగ్ ముగియడంతో మేము బయలుదేరాము. బయటకు వెళ్లే ప్రాంతం చాలా ఇరుకుగా మారిపోయింది. మేము మైదానం వైపు వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు, అకస్మాత్తుగా తోపులాట జరిగింది. చాలా మంది కింద పడిపోయారు. ఆ సమయంలో ఏమి చేయాలో మాకు తెలియలేదు." అని వాపోయారు.