కర్ణాటక రాష్ట్రంలో హిందూ సంస్థ కార్యకర్త హత్య కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర తెలిపారు. మంగళూరు నగరంలోని బాజ్‌పే పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు సుహాస్ శెట్టి అనే వ్యక్తిని హత్య చేశారు.
పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం తర్వాత విలేకరుల సమావేశంలో పరమేశ్వర మాట్లాడుతూ, శెట్టి హత్యకు సంబంధించి ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. సుహాస్ శెట్టి హత్య తర్వాత, VHP శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చింది. మంగళూరు నగరంలో దుకాణాలను మూసివేశారు. మంత్రి పరమేశ్వర, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి దినేష్ గుండూ రావు శుక్రవారం మంగళూరుకు చేరుకుని, శాంతిభద్రతల పరిస్థితిని అంచనా వేయడానికి పోలీసు కమిషనర్ అనుపమ్ అగర్వాల్, డిప్యూటీ కమిషనర్ ముల్లై ముహిలన్‌లతో ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. మంత్రులు భద్రతా ఏర్పాట్లను సమీక్షించి, శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. హింసకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.