మొహర్రం ఊరేగింపులో 8 మంది మృతి.. భారీగా వాహనాలు ధ్వంసం
మొహర్రం పండగ కాదు అమరవీరు త్యాగాలకు ప్రతీక. అలాంటి మొహర్రం పండుగ వేడుకలు నిన్న దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి.
By అంజి Published on 30 July 2023 7:42 AM ISTమొహర్రం ఊరేగింపులో 8 మంది మృతి.. భారీగా వాహనాలు ధ్వంసం
మొహర్రం పండగ కాదు అమరవీరు త్యాగాలకు ప్రతీక. అలాంటి మొహర్రం పండుగ వేడుకలు నిన్న దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. అయితే పలుచోట్ల మొహర్రం ఊరేగింపులో ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. ఊరేగింపులో సంబంధిత సంఘటనల సందర్భంగా భారతదేశం అంతటా కనీసం ఎనిమిది మంది మరణించారు.10 మంది పోలీసు సిబ్బందితో సహా పలువురు గాయపడ్డారు. వారణాసిలోని దోషిపుర ప్రాంతంలో షియా, సున్నీ వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘటనలో అనేకమంది గాయపడ్డారు. వాహనాలు దెబ్బతిన్నాయి. ఢిల్లీలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రాళ్లు రువ్వారు. పశ్చిమ ఢిల్లీలోని నాంగ్లోయ్‌లో నిర్ణీత మార్గాన్ని మార్చకుండా వారిని నిలిపివేశారు.
ఢిల్లీలో ఘర్షణలు
ఢిల్లీలో పోలీసులపై రాళ్లు రువ్వడంతో 12 మంది పోలీసులు గాయపడ్డారు. అంతేకాకుండా ఘర్షణల్లో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘర్షణల తరువాత, పోలీసులు "వికృత జనసమూహాన్ని నియంత్రించడానికి లాఠీఛార్జ్ చేయవలసి వచ్చింది" అని ఢిల్లీ పోలీసు అధికారులు మీడియాకు తెలిపారు. డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (అవుటర్) హరేంద్ర సింగ్ ప్రకారం, కొంతమంది 'తాజియా' ఊరేగింపు నిర్వాహకులు తమ ఊరేగింపును ముందుగా నిర్ణయించిన మార్గం నుండి మళ్లించడానికి ప్రయత్నించడంతో ఘర్షణ ప్రారంభమైంది. మళ్లింపుపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో పోలీసు సిబ్బందిపై రాళ్లు రువ్వారు. పరిస్థితిని నియంత్రించడానికి, గుంపును చెదరగొట్టడానికి, గుంపును నియంత్రించడానికి పోలీసులు "తేలికపాటి లాఠీ-ఛార్జ్"ని చేయాల్సి వచ్చిందని డీసీపీ తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని డీసీపీ తెలిపారు.
యూపీలో ఘర్షణలు
మొహర్రం ఊరేగింపు సందర్భంగా 'షియా', 'సున్నీ' ముస్లిం సంఘాల సభ్యుల మధ్య హింసాత్మక పోరాటం, రాళ్ల దాడి జరిగింది. ఫలితంగా కొందరికి గాయాలు అయ్యాయి. అయితే క్షతగాత్రుల సంఖ్య కచ్చితంగా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో జరిగిన మరో సంఘటనలో, ముహర్రం ఊరేగింపు యొక్క మ్యూజిక్ సిస్టమ్ హై-వోల్టేజ్ కరెంట్ మోసుకెళ్తున్న వైర్‌లతో తాకడంతో ఇద్దరు మరణించారు. 52 మందికి కాలిన గాయాలు అయ్యాయి. అమోరోహ పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) ఆదిత్య లాంగేహ్ తెలిపిన వివరాల ప్రకారం, మృతులను షాను (35), ఒవైస్ (13)గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని చికిత్స కోసం ఢిల్లీకి తరలించినట్లు లాంగే తెలిపారు. మరో ముహర్రం సంబంధిత సంఘటనలో, ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో హైటెన్షన్ వైర్‌తో తాకిన తర్వాత 'తాజియా' మంటల్లో చిక్కుకోవడంతో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
జార్ఖండ్‌లో సంఘటనలు
శనివారం జార్ఖండ్‌లోని బొకారోలో ముహర్రం ఊరేగింపులో నలుగురు వ్యక్తులు విద్యుదాఘాతానికి గురయ్యారు. మరో 13 మంది గాయపడ్డారు. 'తాజియా' 11,000 హై-వోల్టేజ్ టెన్షన్ వైర్‌తో తాకినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఫలితంగా పేలుడు సంభవించింది. మృతులను సాజిద్ అన్సారీ (18), ఆషిఫ్ రజా (21), గులాం హుస్సేన్ (19), ఇనాముల్ రబ్ (34)గా గుర్తించారు. నలుగురి మృతి పట్ల జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సంతాపం వ్యక్తం చేశారు.
గుజరాత్‌లో సంఘటనలు
గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లాలో ముహర్రం ఊరేగింపు సందర్భంగా విద్యుదాఘాతం కారణంగా ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, 22 మంది గాయపడ్డారు. నగరంలోని రసూల్ పారా ప్రాంతంలో 22 కెవి ఓవర్ హెడ్ విద్యుత్ వైరుకు 'తాజియా' తగలడంతో దురదృష్టకర సంఘటన జరిగింది. మృతులను జునైద్ మజోతి (22), సాజిద్ సామా (20)గా గుర్తించారు. అంతకుముందు శనివారం ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు నేతలు హజ్రత్ ఇమామ్ హుస్సేన్‌కు నివాళులర్పించారు.