బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాళ్లోకెళితే.. నలందా జిల్లా కేంద్రం టెల్హడాలోని రోడ్డు పక్కనే ఉన్న హోటల్‌లోకి వేగంగా దూసుకొచ్చిన ఓ ట్రక్కు దూసుకెళ్లింది. దీంతో హోటల్ సిబ్బందితో సహా 8 మంది మృతి చెందగా.. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.
జహనాబాద్ జిల్లా నుంచి వస్తున్న ట్రక్కు అదుపుతప్పి హోటల్‌లోకి దూసుకెళ్లింది. ట్రక్కు డ్రైవర్ ప్రమాదం అనంతరం లారీని అక్కడే వదిలేసి పరారయ్యాడు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే.. మృతుల్లో హోటల్ సిబ్బందితోపాటు.. కస్టమర్లు కూడా ఉన్నారని తెలుస్తోంది.
జరిగిన ఘటనతో ఒక్కసారిగా కోపోద్రిక్తులైన స్థానికులు లారీకి నిప్పంటించారు. సహాయక చర్యలు చేపట్టేందుకు వచ్చిన పోలీసులపై రాళ్లు విసిరారు. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇదిలావుంటే.. రోడ్డుప్రమాద ఘటనపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేయడంతో పాటు.. బాధితులకు వెంటనే సాయం అందిచాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.