ఐస్‌క్రీం తిని తీవ్ర అస్వస్థతకు గురైన 70 మంది
ఐస్‌క్రీం తిని 70 మంది తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన ఒడిశాలోని కొరాపుట్ జిల్లా సిమిలిగుడా సమితి దుదారి పంచాయితీలో చోటు చేసుకుంది.
By అంజి Published on 5 Jun 2023 4:30 AM GMTఐస్‌క్రీం తిని తీవ్ర అస్వస్థతకు గురైన 70 మంది
ఐస్‌క్రీం తిని 70 మంది తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన ఒడిశాలోని కొరాపుట్ జిల్లా సిమిలిగుడా సమితి దుదారి పంచాయితీలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. దుదారి పంచాయతీలో శనివారం సాయంత్రం ఓ వ్యక్తి ఐస్‌క్రీమ్‌లు విక్రయించాడు. నువ్వాపుట్, బడలిగూడ, దుదారి, ఘాట్‌గుడా, సొండిపుట్, కమల జ్వాల, అల్లిగాం గ్రామాలకు చెందిన చిన్నారులు, మహిళలు.. ఆ ఐస్‌క్రీమ్‌లను తిన్నారు. ఆ రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించిన సమయంలో వారు తీవ్ర కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అస్వస్థతకు గురైన వారిని రాత్రికి రాత్ర పలు వాహనాల్లో దమన్‌జోడీ, సునాబెడ ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. దమన్‌జోడీలో 2 మంది, సునాబెడలో 28 మందికి వైద్యులు చికిత్స చేశారు.
నిల్వ ఉంచిన ఐస్‌క్రీం తినడం వలన అది ఫుడ్‌పాయిజన్‌గా మారిందని, దాన్ని తినడంతో ఇలా జరిగిందని దమన్‌జోడీ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం డాక్టర్ సుమన్ కుమార్ తప్పో తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున సమాచారం తెలుసుకున్న పొట్టంగి ఎమ్మెల్యే ప్రీతమ్ పాఢి ఆయా ఆస్పత్రులకు వెళ్లి అస్వస్థత గురైన వారిని పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఆదివారం ఉదయం వరకు 60 మంది ఆరోగ్య పరిస్థితి మెరుగైంది. దీంతో వారిని వాళ్ల ఇళ్లకు పంపించారు. మరో 10 మంది చికిత్స పొందుతున్నారు. జిల్లా ముఖ్య వైద్యాధికారి అరుణ్ కుమార్ పాఢి ఆదేశాల మేరకు దుదారి పంచాయతీలో వివిధ గ్రామాల్లో వైద్య సిబ్బంది ఇంటింటా తిరుగుతూ ప్రజల ఆరోగ్య స్థితిపై ఆరా తీస్తున్నారు.