హాపూర్‌లోని పిల్ఖువా నివాసి శివంగి గోయల్. యుపిఎస్‌సిలో 177వ ర్యాంక్ సాధించింది. తద్వారా తన కుటుంబానికే కాకుండా జిల్లా మొత్తానికి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. అయితే ఆమె విజయం వెనుక ప్రయాణం చాలా కష్టంగా సాగింది. అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివంగికి వివాహమై ఒక కుమార్తె కూడా ఉంది. అత్తమామల వేధింపులతో విసిగిపోయిన ఆమె తల్లిదండ్రులతో కలిసి జీవించడం ప్రారంభించింది. ఆమె భర్తతో విడాకుల కేసు కూడా నడుస్తోంది.
"సమాజంలో పెళ్లయిన ఆడవాళ్ళకి అత్తమామల ఇంట్లో ఏదైనా అన్యాయం జరిగితే భయపడవద్దని, మీ కాళ్ల మీద మీరు నిలబడగలరని చూపించండి, ఆడవాళ్లు ఏమైనా చేయగలరని నేను వారికి సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. బాగా చదివి, కష్టపడి పనిచేస్తే ఐఏఎస్ కావచ్చు'' అని శివంగి తన అనుభవాన్ని, దాన్ని ఎలా అధిగమించిందో గుర్తు చేసుకున్నారు.
పెళ్లికి ముందే ఐఏఎస్ కావాలనుకున్నానని చెప్పింది. అప్పుడు రెండుసార్లు ప్రయత్నించినా రెండుసార్లు విఫలమైంది. తర్వాత ఆమెకు పెళ్లయింది. అత్తమామల ద్వారా గృహ హింసను అనుభవించిన నేపథ్యంలో శివంగి తన ఏడేళ్ల కుమార్తెతో తన తల్లి ఇంటికి తిరిగి వచ్చింది.
"ఏం చేయాలనుకుంటే అది చేయి అని నాన్న చెప్పారు.. "మళ్ళీ సివిల్స్‌కి ఎందుకు సిద్ధం కాకూడదని నేను అనుకున్నానని ఆమె అన్నారు. తాను చిన్నప్పటి నుంచి ఇలాంటి రోజు కోసం కలలు కంటున్నానని శివంగి తెలిపింది. కష్టపడి, అంకితభావంతో ప్రయత్నించడంతో ఎట్టకేలకు ఆ రోజు రానే వచ్చిందని భావోద్వేగంతో అంది.
శివంగి తన విజయాన్ని గూర్చి ఆమె తల్లిదండ్రులు, కుమార్తె రైనాకు తెలియజేసింది. శివంగి హాపూర్ నివాసి. ఆమె తండ్రి, రాజేష్ గోయల్, వ్యాపారవేత్త, ఆమె తల్లి గృహిణి.
తాను స్కూల్‌లో ఉన్నప్పుడు యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలని ప్రిన్సిపల్ అడిగేవారని శివంగి తెలిపారు. అప్పటి నుంచి ఐఏఎస్ కావాలనేది ఆమె కల. యూపీఎస్సీ క్లియర్ చేయడానికి ఆమె ఎటువంటి కోచింగ్‌కు వెళ్లకుండ సింగిల్‌గానే అధ్యయనం చేసింది. ఆమె సబ్జెక్ట్ సోషియాలజీ.