మహారాష్ట్రలో ఘోర ప్రమాదం..ఏడుగురు మహిళా కూలీల దుర్మరణం!
మహారాష్ట్రలోని జల్నా జిల్లా పరిధిలో గల సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై పెను విషాదం చోటుచేసుకుంది
By - Knakam Karthik |
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం..ఏడుగురు మహిళా కూలీల దుర్మరణం!
మహారాష్ట్రలోని జల్నా జిల్లా పరిధిలో గల సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై పెను విషాదం చోటుచేసుకుంది. కడ్వాంచి గ్రామ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మహిళా కూలీలు దుర్మరణం చెందారు. ఎక్స్‌ప్రెస్‌వే పనుల నిమిత్తం మినీ ట్రక్కులో వెళ్తున్న కూలీలను, ముంబై వైపు అతివేగంగా దూసుకొచ్చిన ఓ భారీ ట్రక్కు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి మినీ ట్రక్కు ఛిన్నాభిన్నం అవ్వగా, అందులోని ఏడుగురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో నలుగురు కూలీలు తీవ్రమైన గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో వారిని చికిత్స నిమిత్తం జల్నాలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే ప్రధాన కారణమని భావిస్తున్న పోలీసులు, లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఈ విచారకర ఘటనపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ ఘోర ప్రమాదం హై-స్పీడ్ కారిడార్లలో ప్రయాణికుల భద్రతపై మరియు వాహన వేగ నియంత్రణపై మరోసారి తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది.