కర్ణాటకలోని అగుంబేలోని వన్యప్రాణి సంరక్షకులు 7 అడుగుల పొడవైన కొండచిలువను రక్షించారు. గ్రామంలోని నది ఒడ్డున చేపలు పట్టే వలలో చిక్కుకుంది. అగుంబే రెయిన్‌ఫారెస్ట్ రీసెర్చ్ స్టేషన్ (ARRS) సంస్థలో ఫీల్డ్ డైరెక్టర్‌గా ఉన్న అజయ్ గిరి రెస్క్యూ మిషన్ కు నాయకత్వం వహించారు. అందుకు సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్టు చేశారు.
అగుంబే ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు.. నది ఒడ్డున కొండచిలువను గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. భారీ పాము ప్రమాదవశాత్తు ఫిషింగ్ నెట్‌లో చిక్కుకుంది. నీటిలో కదలకుండా అలాగే పడి ఉంది. ఏఆర్‌ఆర్‌ఎస్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని కత్తెరతో ఫిషింగ్ నెట్ ను కత్తిరించి కొండచిలువను వేరు చేశారు. పాము ఏదో పెద్దది తిన్నట్లు గ్రహించామని.. కత్తెర సహాయంతో పామును మెల్లగా నెట్ నుండి బయటకు తీశామని గిరి తెలిపారు. రెస్క్యూ మిషన్ తర్వాత కొండచిలువ అడవిలో వదిలిపెట్టారు. కొండచిలువను రక్షించిన తర్వాత ARRS బృందం స్థానికులకు పాముల గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది.