డీజే సౌండ్‌కు 63 కోళ్లు బలి.. పోలీసులకు ఫిర్యాదు చేసిన యాజమాని

63 chickens killed due to loud DJ music, claims Odisha poultry farm owner. తన 63 కోళ్లు డీజే సౌండ్‌ను తట్టుకోలేక గిలగిల్లా కొట్టుకుని చనిపోయాయి అంటూ వాటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

By అంజి  Published on  24 Nov 2021 7:30 AM GMT
డీజే సౌండ్‌కు 63 కోళ్లు బలి.. పోలీసులకు ఫిర్యాదు చేసిన యాజమాని

తన 63 కోళ్లు డీజే సౌండ్‌ను తట్టుకోలేక గిలగిల్లా కొట్టుకుని చనిపోయాయి అంటూ వాటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వింత ఘటన ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్‌లో జరిగింది. నీలగిరి పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదులో.. కందగరడి గ్రామానికి చెందిన పౌల్ట్రీ ఫారమ్ యజమాని రంజిత్ పరిదా, తన పొరుగువారి రామచంద్ర పరిదా వివాహ ఊరేగింపులో DJ సౌండ్స్‌ హోరెత్తడంతో అనుమానాస్పద గుండెపోటుతో తన కోళ్లు చనిపోయాయని పేర్కొన్నాడు. రంజిత్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో డీజే బ్యాండ్‌తో పెళ్లి ఊరేగింపు తన పొలం ముందు నుంచి సాగింది. DJ తన పొలం దగ్గరకు చేరుకోగానే, కోళ్లు వింతగా ప్రవర్తించడం ప్రారంభించాయి. కొన్ని ఎగరడం, బుసలు కొట్టడం కూడా ప్రారంభించాయి.

రంజిత్ వాల్యూమ్ తగ్గించమని DJకి పదే పదే అభ్యర్థనలు చేసినప్పటికీ.. చెవిని చీల్చే సౌండ్స్‌ను ప్లే చేశారు. దీని ఫలితంగా 63 కోళ్లు చనిపోయాయి. కోళ్లు ఒక్కసారిగా కుప్పకూలడంతో పౌల్ట్రీ ఫాం యజమాని వాటిని బతికించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అతను స్థానిక పశువైద్యునితో చనిపోయిన కోళ్లను చూపించాడు. అతను పెద్ద శబ్దం కారణంగా పక్షులు షాక్‌కు గురయ్యాయని, అవి చనిపోయాయని నిర్ధారించారు. రంజిత్ (22) అనే ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ ఉద్యోగం దొరక్క 2019లో నీలగిరిలోని సహకార బ్యాంకులో రూ.2 లక్షలు అప్పు తీసుకుని బ్రాయిలర్ ఫారమ్‌ను ప్రారంభించాడు. మొదట పొరుగింటి రామచంద్రను నష్టపరిహారం ఇప్పించాలని కోరగా.. అందుకు నిరాకరించాడు.

దీంతో పెద్ద శబ్దం, బాణసంచా వల్ల పక్షులు షాక్‌కు గురై చనిపోయాయని ఆరోపిస్తూ రంజిత్ రామచంద్రపై నీలగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై నీలగిరి పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు అందిందని బాలాసోర్ పోలీస్ ఎస్పీ సుధాన్షు మిశ్రా తెలిపారు. " అయితే, సమస్యను ఇరువర్గాలు పోలీసు స్టేషన్‌లో సామరస్యపూర్వకంగా పరిష్కరించుకున్నారు" అని తెలిపారు. అయితే రామచంద్ర పరిదా.. రంజిత్‌ చేసిన ఆరోపణలకు కౌంటర్‌ ఇచ్చారు. రోడ్డుపై రోజు లక్షల కోళ్లను హారన్‌ల మధ్య రవాణా చేస్తుంటే, అతని ఫామ్‌లోని పక్షులు డీజే సౌండ్స్‌ వల్ల చనిపోవడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. రంజిత్‌ తన వద్దకు వచ్చి పెద్ద శబ్దం గురించి చెప్పినప్పుడు తాము వెంటనే సౌండ్‌ తగ్గించామని రామచంద్ర పరిదా తెలిపారు.

Next Story