3 రోజుల్లోనే కుంభమేళాలో 6 కోట్ల మంది పుణ్యస్నానాలు..

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. త్రివేణీ సంగమంలో స్నానాలు చేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి అంచనాలకు మించి తరలివస్తున్నారు.

By Knakam Karthik  Published on  16 Jan 2025 12:53 PM IST
NATIONAL NEWS, UTTARPRADESH, PRAYAGRAJ, MAHA KUMBH MELA, DEVOTEES, DEVOTIONAL

3 రోజుల్లోనే కుంభమేళాలో 6 కోట్ల మంది పుణ్యస్నానాలు..

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. త్రివేణీ సంగమంలో స్నానాలు చేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి అంచనాలకు మించి తరలివస్తున్నారు. తొలి రోజు సోమవారం 1.5 కోట్ల మంది భక్తులు రాగా.. రెండో రోజు ఏకంగా 3.5 కోట్ల మంది గంగ, యమున, సరస్వతి నదుల కలిసే ప్రదేశమైన త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. గురువారం అయిన నాలుగో రోజు కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. ఇప్పటివరకు దాదాపు ఆరు కోట్ల మందికి పైగా మహా కుంభమేళాలో పాల్గొన్నారని అధికారులు వెల్లడించారు.

దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశీయుల కూడా పవిత్ర త్రివేణి సంగమంలో స్నానాలు చేసేందుకు వస్తుండటంతో ప్రయాగ్ రాజ్ జనసందోహంగా మారింది. మూడు రోజుల్లోనే 6 కోట్ల మందికిపైగా పుణ్య స్నానాలు ఆచరించారు. ఒక్క మకర సంక్రాంతి రోజునే (మంగళవారం) 3.5 కోట్ల మందికిపైగా వచ్చినట్లు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే నెల 26 వరకు జరిగే ఈ మహా కుంభమేళాకు.. దాదాపు 40 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది.

సంక్రాంతి సందర్భంగా అఖాడాలు, ఆధ్యాత్మిక పీఠాల అధిపతులు, నాగా సాధువులు, సంతులు తొలి రాజస్నానం (షాహి స్నాన్‌)లో పాల్గొన్నారు. తెల్లవారుజామున 3 గంటలకు శ్రీ పంచాయతీ అఖాడా మహానిర్వాణీ, శ్రీ శంభు పంచాయతీ అటల్‌ అఖాఖా సాధువులు త్రివేణీ సంగమంలో తొలి స్నానాలు ఆచరించారు. వారిపై రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్‌ నుంచి పుష్పవర్షం కురిపించింది.

ఇక అత్యంత కీలకమైన మౌనీ అమావాస్య అయిన జనవరి 29న రానుంది. ఆ రోజు ఏకంగా 10 కోట్ల మంది కంటే అధికంగా భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. ఈ నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ ఆదేశించారు.

Next Story