ఐరన్-ఫోలిక్ యాసిడ్ (IFA) మాత్రలను వేసుకున్న తరువాత 50మంది విద్యార్థులు అస్వస్థతకు గురి అయ్యారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటన అస్సాం రాష్ట్రంలోని చరైడియో జిల్లాలో చోటు చేసుకుంది.
పట్సాకు బ్లాక్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని బటౌ సబ్ సెంటర్‌కు చెందిన ఆరోగ్య కార్యకర్తల బృందం శనివారం ఖేరానిపత్తర్ లోయర్ ప్రైమరీ స్కూల్‌లోని 75 మంది విద్యార్థులకు, నిమాలియా లోయర్ ప్రైమరీ స్కూల్‌లోని 26 మంది విద్యార్థులకు ఐఫా మాత్రలను పంపిణీ చేశారు. ఉపాధ్యాయుల సమక్షంలోనే ఈ మాత్రలు పంపిణీ చేసినట్లు, పిల్లలు ఖాళీ కడుపుతో తినవద్దని ఆరోగ్య కార్యకర్తలు సూచించినట్లు అధికారులు తెలిపారు.
అయితే.. కొద్ది సమయం తరువాత ఒక్కో పాఠశాల నుంచి ఇద్దరు చిన్నారులు అస్వస్థతకు గురి అయ్యారు. విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో పాటు, కడుపు నొప్పితో బాధపడుతున్నారని ఆరోగ్య సిబ్బందికి పాఠశాల అధికారులు సమాచారం అందించారు. ఆరోగ్య సిబ్బంది వారిని సోనారీ సివిల్ ఆస్పత్రికి తరలించారు. మరో 48 మంది విద్యార్థులను కూడా పరీక్ష కోసం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
IFA మాత్రలను ప్రభుత్వం ఐరన్-ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్‌లుగా పిల్లలకు అందజేస్తుంది.