ట్రాఫిక్ జరిమానాలు ప్రజలు చెల్లించేలా చేయడానికి ట్రాఫిక్ పోలీసులు పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. తెలంగాణలో కూడా భారీ డిస్కౌంట్స్ ఇచ్చి జరిమానాలు కట్టించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం కూడా అదే తరహా నిర్ణయాన్ని తీసుకుంది. చలాన్ మొత్తంలో 50 శాతం మాత్రమే కట్టాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ VK సక్సేనా ఆమోదం కోసం పంపారు.
ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గహ్లోట్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఢిల్లీ ఎల్‌జీ ఆమోదం పొందిన తర్వాత, ఇప్పటికే ఉన్న చలాన్‌లను నోటిఫికేషన్ వచ్చిన 90 రోజుల్లోగా పరిష్కరించాల్సి ఉంటుందని చెప్పారు. నోటిఫికేషన్ తర్వాత జారీ చేసిన చలాన్లను 30 రోజుల్లోగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఢిల్లీ ప్రభుత్వం దేశ రాజధానిలో ప్రజలకు సౌకర్యాలు కల్పించడానికి, చలాన్ సెటిల్‌మెంట్‌ను ప్రోత్సహించడానికి ఈ చర్య తీసుకుంది. మోటారు వాహన చట్టంలోని కొన్ని ప్రత్యేక సెక్షన్ల కింద ఈ మినహాయింపు వర్తిస్తుందని, ఇది ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది.