మహమ్మారి వ‌చ్చి ఐదేళ్లు గ‌డిచినా.. 2019 నుంచి ఏమి మార‌లే

ప్రపంచ ఆరోగ్య సంస్థ COVID-19ని మహమ్మారిగా ప్రకటించి ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి.

By Medi Samrat
Published on : 8 March 2025 6:02 PM IST

మహమ్మారి వ‌చ్చి ఐదేళ్లు గ‌డిచినా.. 2019 నుంచి ఏమి మార‌లే

ప్రపంచ ఆరోగ్య సంస్థ COVID-19ని మహమ్మారిగా ప్రకటించి ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ ఆ ప్రభావం ఇప్పటికీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఉంది. COVID-19ను ఎదుర్కోవడానికి చేసిన ప్రయత్నాల నేపథ్యంలో.. ప్రభుత్వ అప్పులు రికార్డు స్థాయిలో పెరిగాయి. లేబర్ మార్కెట్‌పై ప్రభావం పడింది. ప్రజలు తమ అలవాట్లను మార్చుకున్నారు. రిమోట్ వర్క్, డిజిటల్ చెల్లింపులు పెరిగాయి. ప్రయాణ విధానాలు కూడా మారాయి.

2020 నుండి ప్రపంచ ప్రభుత్వ రుణం 12 శాతం పెరిగింది. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత చాలా ప్రభుత్వాలు ప్రోత్సాహక ప్యాకేజీలు ఇచ్చాయి. ఈ కాలంలో కార్మికులు, ముడి పదార్థాల కొరత కారణంగా అనేక దేశాలలో ద్రవ్యోల్బణం వేగంగా పెరిగింది. సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచాయి. అనేక ఏజెన్సీల డేటా.. ప్రభుత్వాలు ఎక్కువ రుణాలు తీసుకున్న‌ ధోరణిని చూపుతుంది. దీంతో ఆర్థిక ఇబ్బందులు కూడా పెరిగాయి.

లాక్‌డౌన్‌ కారణంగా లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు. దీని ప్రభావం ఎక్కువగా మహిళలపై పడింది. లాక్‌డౌన్ ముగియడంతో మగవారు తిరిగి విధుల్లో చేరారు. కానీ కుటుంబ బాధ్యతల కారణంగా మహిళల భాగస్వామ్యం తక్కువగానే ఉంది.

ఇంటి నుండి పని చేయడం వల్ల లండన్ వంటి నగరాల్లో నేటికీ ట్రాఫిక్ ఒత్తిడి తక్కువగా ఉంది. ప్రజలు మునుపటిలా తిరుగుతున్నారు. కానీ నగరాల్లో ట్రాఫిక్ తగ్గింది. అయితే విమానాలు, హోటళ్ల ధరలు పెరిగాయి.

లాక్‌డౌన్‌ సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావడం సాధ్యం కానప్పుడు ప్రజలు ఆన్‌లైన్‌ షాపింగ్‌కే మొగ్గు చూపారు. కోవిడ్ ముగిసింది.. కానీ ఈ అలవాటు ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే యూరప్ వంటి ప్రదేశాలలో ప్రజలు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఒకే విధమైన కొనుగోళ్లను చేస్తున్నారు.

డిసెంబర్ 2019 నుండి బిట్‌కాయిన్ ధర 1,233% పెరిగింది. ప్రజలు ఇప్పుడు పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. మహమ్మారి సమయంలో డిజిటల్, డెలివరీ సంస్థల షేర్లు లాభాలను నమోదు చేశాయి. అలాగే వ్యాక్సిన్‌లను తయారు చేస్తున్న ఫార్మాస్యూటికల్ కంపెనీల షేర్లు కూడా లాభాలను నమోదు చేశాయి.

Next Story