కరోనా వైరస్ ముప్పు ఇంకా పూర్తిగా తొలిగిపోకముందే మరో వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. అదే మంకీపాక్స్. అగ్ర రాజ్యం అమెరికాతో పాటు అనేక దేశాల్లో మంకీపాక్స్ కేసులు రోజు రోజుకు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇక మనదేశంలో ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు కానప్పటికీ.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ చిన్నారికి మంకీపాక్స్ తరహా లక్షణాలు కనిపించడం కలకలం రేపుతోంది.
ఘజియాబాద్‌కు చెందిన ఓ ఐదేళ్ల బాలిక శరీరంపై దద్దుర్లు, బొబ్బలురావడంతో ఆ బాలిక తల్లిదండ్రులు ఆందోళన చెందారు. వెంటనే బాలికను ఆస్పత్రికి తరలించారు. బాలిక నుంచి నమూనాలను సేకరించిన అధికారులు పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించినట్లు ఘజియాబాద్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. ఆమెకు ఇతర ఆరోగ్య సమస్యలేవని చెప్పారు. ఆమెకు దగ్గరి సంబంధికులు ఎవరూ గత నెలరోజులుగా విదేశాల్లో పర్యటించలేదని తెలిపారు. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా ఆమె నుంచి నమూనాలు సేకరించామన్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు.
ఆఫ్రికా దేశాల్లో ప్రారంభమైన మంకీపాక్స్ క్రమంగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్నది. శుక్రవారం ఒక్కరోజే ఫ్రాన్స్‌లో 51 మందికి పాజిటివ్ వచ్చింది. అమెరికాలో ఇప్పటివరకు 21 మంది ఈ వైరస్ బారినపడ్డారు.