అంతుపట్టని వ్యాధితో మృత్యువాత పడుతున్న పిల్లలు
జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో అంతుపట్టని వ్యాధితో ప్రజలు మరణిస్తున్నారు.
By Medi Samrat Published on 13 Jan 2025 2:55 PM ISTజమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో అంతుపట్టని వ్యాధితో ప్రజలు మరణిస్తున్నారు. తాజాగా బాలిక మృతి కేసు వెలుగులోకి వచ్చింది. దీంతో బాలిక ఐదుగురు సోదరులు, సోదరీమణులు కూడా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఖవాస్ బ్లాక్‌లోని బాదల్ గ్రామంలో గత నెలన్నర వ్యవధిలో 3 కుటుంబాలకు చెందిన 10 మంది ఈ వ్యాధితో మరణించారు. ఈ రోజు బాలిక మరణం పదవది. చనిపోయిన వారిలో ఎక్కువ మంది చిన్నారులే. మరణానికి గల కారణాలను వైద్యులు ఇంకా కనుగొనలేదు.
పిజిఐ, ఎయిమ్స్, ఎన్‌సిడిసి నిపుణులు గ్రామాన్ని సందర్శించి అనేక నమూనాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపారు. వ్యాధి ఏంటి అనేది కనుగొనబడలేదు. బాలిక మృతదేహాన్ని ఎస్‌ఎంజీఎస్ ఆస్పత్రిలో ఉంచారు. మిగిలిన మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు.
అందిన సమాచారం ప్రకారం.. మరణించిన బాలిక సోదరులు, సోదరీమణులు చాలా అనారోగ్యంతో ఉన్నారు. వీరిలో ముగ్గురిని జమ్మూలోని SMGSḤ ఆసుపత్రిలో చేర్చారు. ఒకరి పరిస్థితి చాలా విషమంగా ఉంది. మిగిలిన ఇద్దరు రాజౌరి ప్రభుత్వ వైద్య కళాశాల (జిఎంసి)లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే జమ్మూ, రాజౌరిలోని ఆసుపత్రుల్లో ఓ మహిళ, ఐదుగురు చిన్నారులు చికిత్స పొందుతున్నారు.
వాస్తవానికి డిసెంబరు 8న గ్రామ నివాసి ముహమ్మద్ అఫ్జల్, అతని కుటుంబ సభ్యులు అస్వస్థతకు గురయ్యారు. అదే రోజు అఫ్జల్ చనిపోయాడు. కొద్ది రోజుల్లోనే అతని నలుగురు పిల్లలు కూడా ఒక్కొక్కరుగా చనిపోయారు. భార్య ప్రస్తుతం జమ్ములోని ప్రభుత్వ వైద్య కళాశాలలో చికిత్స పొందుతూ చావుతో పోరాడుతూ ఉంది. అఫ్జల్ ఇంట్లో మతపరమైన కార్యక్రమం నిర్వహించబడింది. అందులో బంధువులు, పరిచయస్తులు, స్నేహితులు పాల్గొనడానికి వచ్చారు. నివేదిక ప్రకారం.. అస్లాం కుటుంబం కూడా అఫ్జల్ ఇంట్లో ఒక మతపరమైన కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఆహారం తిన్న తర్వాత అస్లాం ఆరుగురు పిల్లలు అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. తొలుత వాంతులు మొదలయ్యాయి. ఆ తర్వాత జ్వరం వచ్చింది. ఆ తర్వాత అపస్మారక స్థితికి చేరడంతో అందరినీ రాత్రిపూట కోట్రంక ఉప జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ పిల్లలకు ప్రథమ చికిత్స అందించి రాజోరికు తరలించారు.
రాజౌరికి చెందిన జహూర్ అహ్మద్ (14), నవీనా కౌసర్ (8), యాస్మిన్ అక్తర్ (15) పరిస్థితి విషమించడంతో వారిని జమ్ముకు తరలించారు. నవీనా కౌసర్ 4 గంటల తర్వాత ఇక్కడ మరణించారు. రాజౌరిలో చేరిన ముహమ్మద్ మరూఫ్ (10) పరిస్థితి విషమించడంతో జమ్మూకు రెఫర్ చేశారు. సఫీనా కౌసర్, జబీనా కౌసర్ ఇప్పటికీ రాజౌరిలో చికిత్స పొందుతున్నారు. కానీ వారి పరిస్థితి మెరుగుపడటం లేదు.
రాజౌరి మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎఎస్ భాటియా, జమ్మూలోని ఎస్‌ఎంజిఎస్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ దారా సింగ్ మాట్లాడుతూ.. ఫుడ్ పాయిజనింగ్‌తో కూడిన కేసులా అనిపిస్తోందని, అయితే చాలా రోజుల తర్వాత ఇప్పుడు బాలిక చనిపోవడంతో.. మరేదైనా కారణం ఉండాలి. అనారోగ్యంతో ఉన్న పిల్లల మెదడు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఏదైనా రహస్య అనారోగ్యం అయి ఉండవచ్చు. ఎవరైనా జబ్బు పడితే మందు ఇవ్వొచ్చు కానీ.. ఆ వ్యాధి ప్రభావం మాత్రం మానసికస్థితిపై ప్రభావం చూపిస్తుందన్నారు.