కుల్గామ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదులు హతం
By Kalasani Durgapraveen Published on 19 Dec 2024 10:28 AM ISTజమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో గురువారం తెల్లవారుజామున భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పులలో ఆర్మీ జవాన్లు ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చారు. ఐదుగురు ఉగ్రవాదులు హతమైనట్లు ఆర్మీ అధికారులు ధృవీకరించారు. జిల్లాలోని బెహిబాగ్ ప్రాంతంలోని కద్దర్‌లో బుధవారం రాత్రి అనుమానాస్పద ఉగ్రవాదుల ఉనికి గురించి సమాచారం అందుకున్న భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. కొంత సమయం తర్వాత సెర్చ్ ఆపరేషన్ ఎన్‌కౌంటర్‌గా మారింది. భద్రతా బలగాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరపగా, ఆర్మీ జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఐదుగురు ఉగ్రవాదులను సైనికులు హతమార్చారు. మరోవైపు ఈ ఆపరేషన్‌లో ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఐదుగురు ఉగ్రవాదుల మృతదేహాలు గార్డెన్‌లో పడి ఉన్నాయని.. వాటిని ఇంకా స్వాధీనం చేసుకోలేదని ఓ అధికారి తెలిపారు.
ఇదిలావుంటే.. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. అంతకుముందు అక్టోబర్ 20న జమ్మూ కాశ్మీర్‌లో గగాంగీర్, గందర్‌బల్, అనేక ఇతర ఉగ్రవాద దాడుల్లో పౌరులను చంపిన ఉగ్రవాది శ్రీనగర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. గత నెలలో జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్, ఖన్యార్‌లలో భద్రతా బలగాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో కూడా ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.