మంగళూరు సమీపంలోని రిటైర్డ్ ఆర్మీ సిబ్బంది ఇంటి దగ్గర ఐదు గ్రెనేడ్లు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. 1979-1980లో తయారు చేయబడిన గ్రెనేడ్‌లను రిటైర్డ్ ఆర్మీ సిబ్బంది శనివారం నాడు గమనించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. మంగళూరుకు 60 కిలోమీటర్ల దూరంలోని బెల్తంగడిలో రిటైర్డ్ ఆర్మీ సిబ్బంది ఇంటి కంచె దగ్గర ఈ గ్రెనేడ్లు ఉంచినట్లు సమాచారం. మాజీ ఆర్మీ అధికారి ఇంటికి సమీపంలోని ఓ ప్రాంతంలో గ్రెనేడ్లను ఉంచారు.. వీటిని గుర్తించిన సదరు ఆర్మీ అధికారి ఓ సేఫ్ ప్లేస్ లో ఆ గ్రెనేడ్స్ ను ఉంచారు. జంతువులు లేదా పిల్లలు వాటిని తీసుకెళ్లకుండా జాగ్రత్త పరిచినట్లు తెలుస్తోంది.
ఒక గ్రెనేడ్ పసుపు రంగులో ప్లాస్టిక్ కవర్ తో చుట్టబడి ఉండగా, మరికొన్ని చెల్లాచెదురుగా ఉన్నాయి. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో గ్రెనేడ్‌లను తయారు చేస్తారని.. వాటిపై ఉన్న ప్రింట్‌ల ప్రకారం వాటిని 1979-1980లో తయారు చేశారని మంగళూరు పోలీసు సూపరింటెండెంట్ సోనవానే రిషికేష్ తెలిపారు. గ్రెనేడ్‌లు యాక్టివ్‌గా ఉన్నాయా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదని.. ఫోరెన్సిక్ బృందం వాటిని పరిశీలిస్తుందని.. వాటిని పోలీసు కస్టడీలో అన్ని జాగ్రత్తలతో సురక్షితంగా ఉంచామని అధికారి తెలిపారు.