భువనేశ్వర్‌లోని కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కేఐఐటీ)లో నేపాలీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు డైరెక్టర్లు, ఇద్దరు సెక్యూరిటీ గార్డులతో సహా ఐదుగురు అధికారులను మంగళవారం అరెస్టు చేశారు. ఈ సంఘటన క్యాంపస్ అంతటా 500 మందికి పైగా నేపాలీ విద్యార్థుల నుండి విస్తృత నిరసనలకు దారితీసింది. వర్సిటీ అధికారులు కొంతమంది విద్యార్థులను క్యాంపస్ నుండి బలవంతంగా పంపించడానికి ప్రయత్నించడంతో దౌత్య జోక్యానికి దారితీసింది.
అరెస్టయిన వ్యక్తులను ఇద్దరు సెక్యూరిటీ గార్డులు రమాకాంత నాయక్, జోగేంద్ర బెహెరాతో పాటు ముగ్గురు యూనివర్సిటీ అధికారులుగా గుర్తించారు. భారతీయ న్యాయ సంహిత (BNS) లోని సంబంధిత సెక్షన్ల కింద అభియోగాలను ఎదుర్కొంటున్నారు. వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఈ ఘటనపై క్షమాపణలు చెప్పారు. "KIIT ఎల్లప్పుడూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు నిలయంగా ఉంది, కలుపుగోలుతనం, సంస్కృతిని పెంపొందిస్తుంది. ఇటీవల జరిగిన సంఘటనకు మేము తీవ్రంగా చింతిస్తున్నాము. మా ప్రియమైన నేపాలీ విద్యార్థులతో సహా మా విద్యార్థులందరి భద్రత, గౌరవం, శ్రేయస్సు కోసం మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాము" అని క్షమాపణ లేఖలో తెలిపారు.