జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. ఉదయం 5:35 గంటలకు రిక్టర్ స్కేలుపై 4.7 తీవ్రతతో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) తెలిపింది. భూమి అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించినట్లు అధికారులు గుర్తించారు.
భూకంపం ప్రభావం కేవలం బారాముల్లాకే పరిమితం కాకుండా, గుల్మార్గ్, శ్రీనగర్ పశ్చిమ ప్రాంతాల్లో కూడా స్పష్టంగా కనిపించింది. పహల్గామ్ నుండి పశ్చిమంగా 84 కిలోమీటర్లు, కార్గిల్ నుండి నైరుతి దిశలో 164 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంప తీవ్రతకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెల్లవారుజామున ఒక్కసారిగా భవనాలు, వీధి దీపాలు ఊగిపోవడం ఈ వీడియోల్లో కనిపిస్తోంది. భూకంపం కారణంగా స్థానికులు భయంతో పరుగులు తీశారు.