భారత్ రహస్యాలను పాక్ కు చేరవేస్తూ అడ్డంగా దొరికిపోయారు

4 DRDO contractual staffers arrested for passing defence secrets to 'Pakistani' agents. పాకిస్తాన్ కు చెందిన ఏజెంట్లతో రక్షణ రహస్యాలను పంచుకున్నందుకు ఒడిశా

By M.S.R  Published on  15 Sep 2021 1:35 PM GMT
భారత్ రహస్యాలను పాక్ కు చేరవేస్తూ అడ్డంగా దొరికిపోయారు

పాకిస్తాన్ కు చెందిన ఏజెంట్లతో రక్షణ రహస్యాలను పంచుకున్నందుకు ఒడిశా పోలీసులు మంగళవారం నాడు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) లోని నలుగురు సిబ్బందిని అరెస్టు చేశారు. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని డీఆర్‌డీఓలోని చండీపూర్ ఠాణాలో పని చేస్తున్నారని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (తూర్పు శ్రేణి) హిమాన్షు లాల్ చెప్పారు. ఒడిశాలోని మిసైల్ టెస్ట్ ఫెసిలిటీ అయిన ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ లో పనిచేస్తున్న ఆ ఉద్యోగులకు పాక్ ఏజెంట్లతో సంబంధాలున్నాయని, పక్కా సమాచారంతోనే వారిని అరెస్ట్ చేశామని హిమాన్షు లాల్ తెలిపారు. బాలాసోర్‌జిల్లా డీఆర్‌డీఓ ఇంటిగ్రేటెడ్‌ రేంజ్‌లో పనిచేస్తున్న వీరిని తొలుత ప్రశ్నించి అనంతరం అదుపులోకి తీసుకున్నట్లు ఐజీ హిమాన్షు లాల్ చెప్పారు.

ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీల నుంచి తమకు రహస్య సమాచారం వచ్చిందని.. కొందరు వ్యక్తులు రహస్య సమాచారాన్ని విదేశీ ఏజెంట్లకు అందించేందుకు యత్నిస్తున్నారని తెలిపారు. వీరికి పలు ఐఎస్‌డీ నెంబర్ల నుంచి ఫోన్లు వచ్చాయని సమాచారం అందిందన్నారు. వెంటనే నలుగురు డీఎస్‌పీలతో ఏర్పాటైన పోలీసు టీములు ఏర్పాటు చేసి దర్యాప్తు ఆరంభించామని చెప్పారు. ఈ టీములు జరిపిన దాడుల్లో నలుగురు ఉద్యోగులు దొరికినట్లు వెల్లడించారు. అనైతికంగా రహస్య సమాచారం అందించి నిధులు పొందుతున్న ఆరోపణపై వీరిని అదుపులోకి తీసుకున్నామని అధికారులు చెప్పారు. వీరి నుంచి నేరాలు రుజువు చేసే పలు ఆధారాలు కూడా దొరికాయని చెప్పారు. నిందితులపై IPC సెక్షన్ 120-B (నేరపూరిత కుట్రకు శిక్ష), 121-A (భారతదేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి కుట్ర) మరియు 34 (సాధారణ ఉద్దేశ్యంతో చేసిన చర్య), మరియు అధికారిక రహస్యాల చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేయబడ్డాయి. ఈ విషయమై డీఆర్‌డీఓ స్పందించేందుకు నిరాకరించింది.


Next Story