ఒక్కరోజులోనే.. పిడుగుపాటుకు 38 మంది మృత్యువాత

పిడుగుపాటు కారణంగా ఉత్తరప్రదేశ్‌లో బుధవారం జరిగిన వేర్వేరు ఘటనల్లో కనీసం 38 మంది మరణించారు.

By అంజి  Published on  11 July 2024 5:53 AM GMT
lightning strikes, UttarPradesh,Auraiya, Deoria, Hathras, Varanasi

ఒక్కరోజులోనే.. పిడుగుపాటుకు 38 మంది మృత్యువాత

పిడుగుపాటు కారణంగా ఉత్తరప్రదేశ్‌లో బుధవారం జరిగిన వేర్వేరు ఘటనల్లో కనీసం 38 మంది మరణించారు. వరదల కారణంగా సాధారణ జనజీవనం స్తంభించింది. రాష్ట్రంలో వేర్వేరు చోట్ల పిడుగులు పడటంతో 38 మరణాలు నమోదయ్యాయి. ప్రతాప్‌గఢ్‌లో పిడుగుల కారణంగా అత్యధికంగా 11 మరణాలు సంభవించాయి. ఆ తర్వాత సుల్తాన్‌పూర్‌లో ఏడు, చందౌలీలో ఆరు, మెయిన్‌పురిలో ఐదు, ప్రయాగ్‌రాజ్‌లో నాలుగు, ఔరయ్యా, డియోరియా, హత్రాస్, వారణాసి, సిద్ధార్థనగర్‌లలో ఒక్కొక్కటి ఉన్నాయి. ఈ జిల్లాల్లో పదుల సంఖ్యలో ప్రజలు కాలిన గాయాలకు గురయ్యారు.

ప్రతాప్‌గఢ్‌లో, ఐదు వేర్వేరు ప్రాంతాల్లో మరణాలు సంభవించాయి. వారి మృతదేహాలను సేకరించి పోస్ట్‌మార్టం కోసం పంపారు.

తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీలో కూడా పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. 13, 15 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు చిన్నారులతో సహా చాలా మంది బాధితులు పొలంలో లేదా చేపలు పట్టేటప్పుడు పిడుగుపాటుకు గురయ్యారు.

సుల్తాన్‌పూర్‌లో ఏడుగురు మృతి చెందగా వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. వరి నాట్లు, మామిడి కాయలు కోసేందుకు, నీరు తెచ్చేందుకు వెళ్లిన సమయంలో పిడుగుపాటుకు గురయ్యారు. బుధవారం భారీ వర్షం కురుస్తుండగా చెట్టు కింద తలదాచుకుంటున్న ఓ మహిళ పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందింది.

వర్షం కురుస్తుండటంతో మామిడి చెట్టు కింద తలదాచుకున్న 14 ఏళ్ల బాలుడు ఔరయ్య మృతి చెందాడు. డియోరియాలో, తన కుటుంబ సభ్యులు అప్పటికే ఉన్న పొలం వైపు నడుచుకుంటూ వెళుతుండగా పిడుగుపాటుకు గురై 5 ఏళ్ల బాలిక మరణించింది. వారణాసిలో ఇద్దరు సోదరులు పిడుగుపాటుకు గురవ్వగా, ఒకరు కాలిన గాయాలతో మృతి చెందగా, మరొకరు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

అయితే, రాబోయే ఐదు రోజుల్లో ఉత్తరప్రదేశ్, దాని పరిసర రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాల్లో మరింత విస్తృతమైన వర్షపాతం కొనసాగుతుందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది.

Next Story