Karnataka polls: ఎన్నికల బరిలో 3,632 అభ్యర్థులు.. నేడే 5,102 నామినేషన్ల పరిశీలన
కర్ణాటకలో మే 10న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు పత్రాల దాఖలుకు చివరి రోజైన గురువారం వరకు 3,600 మంది
By అంజి Published on 21 April 2023 9:12 AM ISTKarnataka polls: ఎన్నికల బరిలో 3,632 అభ్యర్థులు.. నేడే 5,102 నామినేషన్ల పరిశీలన
బెంగళూరు: కర్ణాటకలో మే 10న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు పత్రాల దాఖలుకు చివరి రోజైన గురువారం వరకు 3,600 మంది అభ్యర్థులు మొత్తం 5,102 నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారులు ఇక్కడ తెలిపారు. ఏప్రిల్ 13న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం నామినేషన్లలో 3,327 మంది పురుష అభ్యర్థులు 4,710 నామినేషన్లు దాఖలు చేయగా, 304 మంది మహిళా అభ్యర్థులు 391 నామినేషన్లు దాఖలు చేశారు. ఒక నామినేషన్‌ను "అదర్ జెండర్" అభ్యర్థి దాఖలు చేసినట్లు కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం గురువారం రాత్రి ప్రకటనలో తెలిపింది.
బీజేపీకి చెందిన అభ్యర్థులు 707, కాంగ్రెస్ 651, జేడీ(ఎస్) 455, ఇతర చిన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు 707 నామినేషన్లు దాఖలు చేశారని పేర్కొంది. అధికారుల ప్రకారం.. ఒక అభ్యర్థి నాలుగు నామినేషన్ల వరకు దాఖలు చేయవచ్చు. పత్రాల దాఖలుకు చివరి రోజైన గురువారం పలువురు ప్రముఖ నేతలతో సహా 1,691 మంది అభ్యర్థులు 1,934 నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలు గడువుకు కొన్ని గంటల ముందు ఆశ్చర్యకరమైన చర్యలో, బెంగళూరు రూరల్ నుండి కాంగ్రెస్ ఎంపీ డికె సురేష్ కనకపుర సెగ్మెంట్ నుండి బరిలోకి దిగారు. అక్కడ నుండి అతని అన్నయ్య, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డికె శివకుమార్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు.
పలువురు కాంగ్రెస్ కార్యకర్తల ప్రకారం.. శివకుమార్ నామినేషన్ తిరస్కరణకు గురైన సందర్భంలో సురేష్ తన పత్రాలను "బ్యాకప్ ప్లాన్"గా దాఖలు చేశారు. హాసన్‌లో జేడీ(ఎస్) అభ్యర్థి హెచ్‌పీ స్వరూప్ మాజీ ప్రధాని, జేడీ(ఎస్) అధినేత హెచ్‌డీ దేవెగౌడ కుటుంబ సభ్యుల మద్దతుతో నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ బుధవారం రాత్రి టికెట్ ప్రకటించిన శివమొగ్గ నుండి బిజెపి అభ్యర్థి చన్నబసప్ప, ఎన్నికల రాజకీయాల నుండి రిటైర్మెంట్ ప్రకటించిన సీనియర్ నాయకుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే కెఎస్ ఈశ్వరప్ప సమక్షంలో తన పత్రాలను దాఖలు చేశారు.
ఇండిపెండెంట్ ఎంపీ సుమలత అంబరీష్, మంత్రి సీఎన్ అశ్వత్ నారాయణ్‌తో కలిసి మండ్య బీజేపీ అభ్యర్థి అశోక్ జయరామ్ నామినేషన్ దాఖలు చేశారు. నివేదికల ప్రకారం.. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సతీష్ జార్కిహోళి బెళగావి జిల్లాలోని యెమకనమర్డి నుండి నామినేషన్ దాఖలు చేశారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో కలిసి మంత్రి శశికళ జోలె తన సంప్రదాయ స్థానమైన నిప్పాని నుంచి పత్రాలను దాఖలు చేశారు. గురువారం నామినేషన్లు దాఖలు చేసిన వారిలో బిజెపికి చెందిన ఎంపి రేణుకాచార్య (హొన్నాళి), కట్టా జగదీష్ (హెబ్బాళం), రామచంద్రగౌడ్ (సిడ్లఘట్ట), కాంగ్రెస్‌కు చెందిన రామనాథ రాయ్ (బంట్వాళ), యోగేష్ హెచ్‌సి (శివమొగ్గ) ఉన్నారు.
ఏప్రిల్ 21న నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 24న నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు.