దేశ వ్యాప్తంగా తెరుచుకున్న 32 ఎయిర్‌పోర్టులు..ఆంక్షలు ఎత్తివేత
32 విమానాశ్రయాల్లో పౌర విమాన కార్యకలాపాలు తక్షణమే అందుబాటులోకి రానున్నాయి
By Knakam Karthik
దేశ వ్యాప్తంగా తెరుచుకున్న 32 ఎయిర్‌పోర్టులు..ఆంక్షలు ఎత్తివేత
భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో నార్త్, ఈస్ట్ ఇండియా వ్యాప్తంగా మే 15 వరకు అన్ని ఎయిర్‌పోర్టులను కేంద్ర ప్రభుత్వం మూసివేసిన సంగతి తెలిసింది. అయితే భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన దృష్ట్యా సోమవారం ఎయిర్ నావిగేషన్ సేవలను నిర్వహించే ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నోటీస్ ఏర్‌మెన్ ఆంక్షలను ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం వాణిజ్య విమాన సంస్థలు విమానాశ్రయాలకు సంబంధించి రాకపోకలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర పౌర విమానయాన శాఖ పేర్కొంది. దీంతో మొత్తం 32 విమానాశ్రయాల్లో పౌర విమాన కార్యకలాపాలు తక్షణమే అందుబాటులోకి రానున్నాయి. దేశ భద్రత దృష్ట్యా ప్రయాణికులను ఆయా ఎయిర్‌పోర్టులలో క్షుణ్ణంగా తనిఖీ చేయాలని భద్రతా సిబ్బందికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలు జారీ చేసింది.
కాగా, తిరిగి తెరుచుకున్న విమానాశ్రయాల్లో చండీగఢ్, అమృత్‌సర్, లూధియానా, శ్రీనగర్, పాటియాలా, భుంటార్, కిషన్‌గఢ్, సిమ్లా, భగిందా, కాంగ్రా-గ్గల్, జైసల్మేర్, భుజ్, కాండ్లా, కేశోడ్, పోర్బందర్, హిరాసర్, జామ్‌నగర్, ముంద్రా, లేహ్, జమ్మూ, పఠాకోట్, హల్వారా, బికనీర్, జోధ్‌పూర్ ఉన్నాయి. మరికొన్ని ఎయిర్‌పోర్టుల్లో రాకపోకలు ప్రారంభం కావడానికి సాయంత్రం వరకు సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.