తమిళనాడులోని కోయంబత్తూరులో కళాశాల విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు నిందితులపై పోలీసులు కాల్పులు జరిపి అరెస్ట్ చేశారు. తప్పించుకునే ప్రయత్నంలో నిందితులు పోలీసులపై దాడి చేయడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపడంతో పాటు రాజకీయ దుమారానికి దారితీసింది.
కోయంబత్తూరు విమానాశ్రయం సమీపంలో ఆదివారం రాత్రి కారులో ఉన్న ఓ విద్యార్థిని, ఆమె స్నేహితుడిపై కొందరు దాడి చేశారు. స్నేహితుడిని కొట్టి, విద్యార్థినిని అపహరించి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.
సోమవారం ఓ ఆలయం వద్ద నిందితులైన తవాసి, కరుప్పసామి, కాళీశ్వరన్‌లను పోలీసులు చుట్టుముట్టారు. పట్టుబడతామని గ్రహించిన నిందితులు, తమ వద్ద ఉన్న కొడవళ్లతో పోలీసులపై దాడికి యత్నించారు. ఈ క్రమంలో హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ చేతికి, మణికట్టుకు గాయాలయ్యాయి. ఆత్మరక్షణ కోసం పోలీసులు నిందితుల కాళ్లపై కాల్పులు జరిపారు. గాయపడిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని, చికిత్స కోసం కోయంబత్తూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన కానిస్టేబుల్‌కు కూడా అదే ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. నిందితులు శివగంగై జిల్లాకు చెందినవారని, కోయంబత్తూరులో భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. వీరిపై గతంలోనూ పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లు గుర్తించారు.