లిఫ్ట్‌లో ఇరుక్కున్న ముగ్గురు బాలిక‌లు

3 Girls Stuck In Society Lift For 20 Minutes.ముగ్గురు చిన్నారులు సోసైటీ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Dec 2022 11:32 AM IST
లిఫ్ట్‌లో ఇరుక్కున్న ముగ్గురు బాలిక‌లు

ముగ్గురు చిన్నారులు సోసైటీ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. 8 నుంచి 10 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు ఉన్న ఆ చిన్నారులు 20 నుంచి 25 నిమిషాల పాటు అందులోనే ఉండిపోయారు. ప్రాణ‌భ‌యంతో వ‌ణికిపోయారు. ఇందుకు సంబంధించిన సీసీ టీవీ పుటేజ్ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ ఘ‌ట‌న ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది.

ఘజియాబాద్‌లోని క్రాసింగ్స్ రిపబ్లిక్ టౌన్‌షిప్‌లోని అసోటెక్ ది నెస్ట్‌లో న‌వంబ‌ర్ 29న ముగ్గురు చిన్నారులు లిఫ్ట్ లో ఉండ‌గా స‌డెన్ ఆగిపోయింది. లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసేందుకు చిన్నారులు ప్ర‌య‌త్నించినా ఓపెన్ కాలేదు. దీంతో సాయం కోసం చిన్నారులు గ‌ట్టిగా అరిచారు. అయితే ఫ‌లితం లేకుండా పోయింది.


సీసీ టీవీ వీడియోలో అమ్మాయిలు లిఫ్ట్ డోర్‌ను బలవంతంగా తెరవడానికి ప్రయత్నించడం, సహాయం కోసం కాల్ చేయడానికి లిఫ్ట్‌లోని బటన్‌లను నొక్కడం, ఒకరినొకరు ఓదార్చడానికి ప్రయత్నించడం చూడవచ్చు. వారు ఒకరినొకరు ఓదార్చుకుంటూ ఏడ‌వ‌డాన్ని గ‌మ‌నించ‌వ‌చ్చు. దాదాపు 20 నుంచి 25 నిమిషాల పాటు ఆ చిన్నారులు ప్రాణ భ‌యంతో అందులోనే ఉండిపోయారు.

లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన బాలికల‌ త‌ల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. త‌ర‌చుగా సొసైటీ లిఫ్ట్‌ల‌లో ప్ర‌జ‌లు చిక్కుకుపోతున్నార‌ని, ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వారు చెబుతున్నారు. లిఫ్ట్‌లు ఆగిపోయిన స‌మ‌యంలో అందులో సీనియ‌ర్ సిటీజ‌న్లు, చిన్నారులు ఉంటే వారి ప్రాణాల‌కే ప్ర‌మాదం ఉంటుంద‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.

Next Story