కాలేజీలో విద్యార్థులు హైడ్రామాకు తెరలేపారు. కాలేజీలో ఏటీఎం, ఓపెన్ ఎయిర్ జిమ్‌తో పాటు పలు వస్తువులను సమకూర్చాలంటూ విద్యార్థులు వాటర్ ట్యాంక్ ఎక్కి డిమాండ్ చేశారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న మహారాణి కాలేజీలో ముగ్గురు విద్యార్థినులు వాటర్ ట్యాంక్ ఎక్కారు. తమకు ఏటీఎంతో పాటు ఓపెన్ ఎయిర్ జిమ్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వారి డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో బాలికలు కిందకు దిగారని పోలీసులు చెప్పారు.
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్) యోగేష్ గోయల్ మాట్లాడుతూ.. ముగ్గురు బాలికలు తమ డిమాండ్లతో ట్యాంక్ పైకి ఎక్కారని తెలిపారు. వారు దిగేందుకు నిరాకరించడంతో వారి తల్లిదండ్రులను పిలిపించి ఒప్పించే ప్రయత్నం చేశారు. విద్యార్థి సంఘాల ఎన్నికలకు ముందు కాలేజీ ఆవరణలో ఏటీఎం మిషన్లు, బ్యాంకులు, ఓపెన్ ఎయిర్ జిమ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
కాగా, రాజస్థాన్ యూనివర్సిటీలో ఉన్న మరో వాటర్ ట్యాంక్‌పై ముగ్గురు విద్యార్థి నాయకులు గత 48 గంటలుగా ఉన్నారు. విద్యార్థి సంఘాల ఎన్నికల తేదీని పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, తేదీని పొడిగించేందుకు ప్రభుత్వం ఇప్పటికే నిరాకరించింది. ముగ్గురు విద్యార్థి నాయకులను ఒప్పించేందుకు సీనియర్ పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నారు. రాజస్థాన్‌లో స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికలు ఆగస్టు 26న జరగనుండగా, ఆగస్టు 27న ఓట్ల లెక్కింపు జరగనుంది.