కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఆ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా తిరువనంతపురంలోని పూజపురా సెంట్రల్ జైలులో 262 మంది ఖైదీలకు కోవిడ్ -19 పాజిటివ్ అని తేలింది. గత మూడు రోజుల్లో 936 మంది ఖైదీలకు యాంటిజెన్ పరీక్షలు నిర్వహించగా, అందులో 262 నమూనాలు పాజిటివ్‌గా వచ్చాయి. వ్యాధి సోకిన ఖైదీల సంరక్షణకు ప్రత్యేక వైద్యులను నియమించాలని జైలు సూపరింటెండెంట్ కోరారు. కోవిడ్ పాజిటివ్ అని తేలిన ఖైదీలను ప్రత్యేక సెల్ బ్లాక్‌కు తరలించారు.
కన్నూర్ జైలులో 10 మందికి పాజిటివ్
మరోవైపు కన్నూర్‌లోని సెంట్రల్ జైలులో 10 మంది ఖైదీలకు కోవిడ్ -19 పాజిటివ్ వచ్చింది. పాజిటివ్‌గా తేలిన వారు కోజికోడ్, కాసర్‌గోడ్‌కు చెందిన రిమాండ్ ఖైదీలు. ఈ ఖైదీలను ప్రత్యేక సెల్ బ్లాక్‌లో ఉంచారు. జైలులో ఉన్న ఇతర ఖైదీలకు మరిన్ని పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేరళలో కోవిడ్ -19 కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది, శుక్రవారం 41,668 తాజా ఇన్‌ఫెక్షన్లు నమోదయ్యాయి. తిరువనంతపురం 7,896 పాజిటివ్ కేసులతో అగ్రస్థానంలో ఉంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆంక్షలు విధించింది.