నవరాత్రి సందర్భంగా ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) కింద 25 లక్షల ఉచిత LPG కనెక్షన్‌లను కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. దీంతో దేశవ్యాప్తంగా ఉజ్వల లబ్ధిదారుల సంఖ్య 10.6 కోట్లకు పెరగనుంది. పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రి హర్దీప్ పూరి సోమవారం మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతి కనెక్షన్‌పై రూ. 2,050 ఖర్చు చేస్తుందని, ఇందులో ఉచిత ఎల్‌పిజి సిలిండర్, గ్యాస్ స్టవ్, రెగ్యులేటర్ మరియు ఇతర సంబంధిత పరికరాలు ఉంటాయన్నారు. ఇది మహిళలకు నవరాత్రి కానుకగా పేర్కొన్న పూరి, ఉజ్వల విస్తరణ మహిళా శక్తిని గౌరవించాలనే ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న నిబద్ధతను తెలియజేస్తుందని అన్నారు.
మంత్రి హర్దీప్ పూరి ఎక్స్‌పై ఒక పోస్ట్‌లో.. 'ప్రధాని మోదీ దుర్గాదేవి వంటి మహిళలను గౌరవిస్తారు. ఈ నిర్ణయం తల్లులు, సోదరీమణులను గౌరవించడం.. సాధికారత కల్పించాలనే మా సంకల్పాన్ని మరింత బలపరుస్తుంది. ఈ పథకం సాధికారతకు ప్రతీక అని, మార్పుకు మూలమని మంత్రి కొనియాడారు. జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రజల్లో ఆనందం వెల్లివిరిస్తోందని, దీని వల్ల దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 0.8 శాతం పెరగవచ్చని కేంద్ర మంత్రి హర్దీప్ పూరీ అన్నారు. కొత్త జీఎస్టీ సంస్కరణలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. వివిధ వినియోగ వస్తువులపై జీఎస్టీ రేట్లు తగ్గించినందున జీఎస్టీ సంస్కరణలు అన్ని వర్గాలకు, ముఖ్యంగా దిగువ మధ్యతరగతి, ఆర్థికంగా బలహీన వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తాయని పూరీ చెప్పారు.