ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయంలో 228 కిలోల బంగారం మాయమైనట్లు జ్యోతిర్మఠం స్వామి అవిముక్తేశ్వరానంద శంకరాచార్య సంచలన ఆరోపణలు చేశారు. కేదార్‌నాథ్‌లో బంగారం కుంభకోణం జరిగింది.. ఆ విషయాన్ని ఎందుకు లేవనెత్తడం లేదు.. అక్కడ స్కామ్ చేసి, ఇప్పుడు ఢిల్లీలో కేదార్‌నాథ్ నిర్మిస్తారా? ఆపై మరో స్కామ్ జరుగుతుందని విరుచుకుపడ్డారు. కేదార్‌నాథ్‌లో 228 కిలోల బంగారం కనిపించడం లేదు.. దానిపై కనీసం విచారణ లేదు. ఇప్పుడు ఢిల్లీలో కేదార్‌నాథ్ ఆలయాన్ని నిర్మిస్తామని చెబుతున్నారని, దీనికి ఎవరు బాధ్యులని ఆయన ప్రశ్నించారు.
దేశ రాజధాని ఢిల్లీలో కేథార్‌నాథ్ ఆలయం నిర్మాణానికి జులై 10న శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కూడా పాల్గొన్నారు. ఢిల్లీలో ఆలయ నిర్మాణం పట్ల నిరసన తెలుపుతూ అవిముక్తేశ్వరానంద సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ థాకరేతో సమావేశమైన స్వామి అవిముక్తేశ్వరానంద్ మళ్లీ మహారాష్ట్ర సీఎం అవుతారని జోస్యం చెప్పారు. “మనమంతా సనాతన ధర్మాన్ని అనుసరించేవాళ్లం.. పాపం, పుణ్యం అనే వాటికి నిర్వచనం ఉంది. అతి పెద్ద పాపం ద్రోహం.. ఉద్ధవ్ ఠాక్రే మోసపోయారు. ఆయనకు చేసిన ద్రోహానికి తామంతా బాధపడ్డామని చెప్పాను. ఆయన మళ్లీ మహారాష్ట్ర సీఎం అయ్యే వరకు మా బాధలు తీరవు’’ అన్నారాయన.