గుజరాత్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. కల్తీ మద్యం తాగి 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు ఆస్పత్రి పాలైయ్యారు. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ రంగంలోకి దిగి విచారణ ప్రారంభించాయి. కల్తీ మద్యం తయారుచేస్తున్న బోటాడ్ జిల్లాకు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు గుజరాత్ డీజీపీ ఆశిష్ భాటియా వెల్లడించారు.
బోటాడ్ జిల్లాలోని రోజిడ్ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన కొందరు ఆదివారం రాత్రి అనారోగ్యానికి గురై ప్రభుత్వ ఆస్పత్రిలో చేరడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సోమవారం ఉదయం ఇద్దరు మరణించగా మిగిలిన వారు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువగా రోజువారీ కూలీలే ఉన్నారు. భావ్‌నగర్, బోటాడ్, బర్వాలా, ధంధూకాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో దాదాపు 30 మంది వరకు చికిత్స పొందుతున్నారు. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
గుజరాత్ పర్యటనలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కల్తీ మద్యం వ్యాపారులకు రాజకీయ రక్షణ ఉందని కేజ్రీవాల్ ఆరోపించారు. నిషేదం అమలులో ఉన్న గుజరాత్‌లో అక్రమ మద్యం పెద్ద మొత్తంలో అమ్ముతున్నట్లు ఆరోపించారు. దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.