ఆకలి సూచీలో భారత్‌కు 111వ స్థానం.. రిపోర్ట్‌ని తప్పుపట్టిన ప్రభుత్వం
ప్రపంచ ఆకలి సూచీలో (గ్లోబల్ హంగర్ ఇండెక్స్-జీహెచ్‌ఐ) భారత్ స్థానం మరింత దిగజారింది. 125 దేశాల గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో భారత్ 111వ స్థానానికి చేరుకుంది.
By అంజి Published on 13 Oct 2023 8:48 AM IST
ఆకలి సూచీలో భారత్‌కు 111వ స్థానం.. రిపోర్ట్‌ని తప్పుపట్టిన ప్రభుత్వం
ప్రపంచ ఆకలి సూచీలో (గ్లోబల్ హంగర్ ఇండెక్స్-జీహెచ్‌ఐ) భారత్ స్థానం మరింత దిగజారింది. ప్రపంచ దేశాల్లో ఆకలి స్థాయిలు, పోషకాహార లోపాలను సూచించే ఈ సూచీలో 2023 సంవత్సరానికి గానూ మొత్తం 125 దేశాలను పరిగణనలోకి తీసుకొంటే 28.7 హంగర్ స్కోరుతో భారత్ 111వ స్థానంలో నిలిచింది. గతేడాది ర్యాంకుతో పోలిస్తే నాలుగు స్థానాలను కోల్పోయింది. దేశంలోని పిల్లల్లో పోషకాహార లోపం రేటు అత్యధికంగా 18.7 శాతంగా ఉందని కూడా పేర్కొంది. అయితే భారత ప్రభుత్వం ఈ నివేదికను "తప్పు" అని పేర్కొంటూ తిరస్కరించింది.
ఇది అవాస్తవ నివేదిక అని, మన దేశ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నమని భారత ప్రభుత్వం పేర్కొంది. "2023 గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో 28.7 స్కోర్‌తో, భారతదేశం తీవ్రమైన ఆకలి స్థాయిని కలిగి ఉంది" అని కన్సర్న్ వరల్డ్‌వైడ్ అండ్ ఐర్లాండ్, జర్మనీకి చెందిన ప్రభుత్వేతర సంస్థలు వెల్ట్ హంగర్ హిల్ఫ్ గురువారం విడుదల చేసిన గ్లోబల్ నివేదిక పేర్కొంది. 2022లో ఆకలి సూచీలో 125 దేశాలలో భారతదేశం 107వ స్థానంలో నిలిచింది. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ.. ఈ రిపోర్ట్‌ని ఖండించింది.
''ఈ సూచిక "ఆకలి" యొక్క లోపభూయిష్ట కొలతగా కొనసాగుతోంది. ఇది భారతదేశంలోని వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించడం లేదు" అని పేర్కొంది. భారత్‌లో పోషకాహార లోపం రేటు 16.6 శాతం, ఐదేళ్లలోపు పిల్లల మరణాల రేటు 3.1 శాతం, 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లో రక్తహీనత ప్రాబల్యం 58.1 శాతంగా ఉందని గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదిక పేర్కొంది.
జీహెచ్‌ఐ నివేదిక ప్రకారం.. పాకిస్థాన్‌కు 102, బంగ్లాదేశ్‌కు 81, నేపాల్‌కు 69, శ్రీలంకకు 60వ ర్యాంకు లభించింది. ప్రపంచ ఆకలి విషయంలో ఈ దేశాలు భారతదేశం కంటే మెరుగైన పనితీరును కనబరిచాయి. దక్షిణాసియా, సబ్-సహారా ఆఫ్రికాలో అత్యధిక ఆకలి స్థాయిలు ఉన్నాయి.