జైపూర్ పేలుళ్ల కేసులో దోషులకు జీవిత ఖైదు.. నిందితులు నవ్వుతూ..
జైపూర్ బాంబు పేలుళ్లకు సంబంధించిన కీలక కేసులో ప్రత్యేక కోర్టు కీలక తీర్పు వెలువరించింది.
By Medi Samrat
జైపూర్ బాంబు పేలుళ్లకు సంబంధించిన కీలక కేసులో ప్రత్యేక కోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2008లో జరిగిన ఈ భీకర ఉగ్రదాడికి సంబంధించిన కేసులో ప్రత్యేక న్యాయమూర్తి రమేష్ కుమార్ జోషి నలుగురు ఉగ్రవాదులను దోషులుగా నిర్ధారించి జీవిత ఖైదు విధించారు. దోషుల్లో సర్వార్ అజ్మీ, సైఫుర్ రెహ్మాన్, మహ్మద్ సైఫ్, షాబాజ్ అహ్మద్ ఉన్నారు. వీరందరినీ భారత శిక్షాస్మృతిలోని సెక్షన్‌లు 120బి, 121-ఎ, 124-ఎ, 153-ఎ, 307, యుఎపిఎ చట్టం 1967లోని సెక్షన్ 18, పేలుడు పదార్థాల చట్టం 1908లోని సెక్షన్‌లు 4 మరియు 5 కింద కోర్టు దోషులుగా నిర్ధారించింది.
చాంద్‌పోల్ హనుమాన్ దేవాలయం సమీపంలో లైవ్ బాంబు దొరకడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 4న నిందితులందరినీ దోషులుగా నిర్ధారించిన న్యాయమూర్తి జోషి శిక్షను కూడా ప్రకటించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. శిక్ష ఖరారు చేసిన తర్వాత కూడా నిందితులంతా నవ్వుతూ కోర్టు నుంచి బయటకు వచ్చారు. వారి ముఖంలో కోపంగానీ, ఆవేశంగానీ కనిపించలేదు.
అంతకుముందు శుక్రవారం జైపూర్ బాంబు పేలుళ్ల కేసుల్లో నలుగురిని ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించింది. లైవ్ బాంబ్ కేసులో సైఫుర్ రెహమాన్, మహ్మద్ సైఫ్, మహ్మద్ సర్వర్ అజ్మీ, షాబాజ్ అహ్మద్‌లను కోర్టు దోషులుగా నిర్ధారించింది.
నలుగురు ఉగ్రవాదులను భారత శిక్షాస్మృతిలోని 4 సెక్షన్లు, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ)లోని 2 సెక్షన్లు, పేలుడు పదార్థాల చట్టంలోని 3 సెక్షన్ల కింద దోషులుగా నిర్ధారించారు. ఈ సెక్షన్లలో గరిష్టంగా జీవిత ఖైదు విధించే నిబంధన ఉంది. వరుస పేలుళ్ల కేసులో షాబాజ్ మినహా ఇతరులకు మరణశిక్ష విధించగా.. హైకోర్టు వారిని నిర్దోషులుగా ప్రకటించింది. మరణశిక్ష కేసులో రాష్ట్ర ప్రభుత్వ అప్పీలు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది.