భీమా కోరేగావ్ కేసులో గోన్సాల్వేస్, అరుణ్ ఫెరీరాలకు బెయిల్‌

2 Elgar Parishad case accused get bail. భీమా కోరేగావ్ కేసుకు సంబంధించిన ఎల్గార్ పరిషత్ కేసులో ఇద్దరు నిందితులకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది.

By Medi Samrat  Published on  28 July 2023 5:20 PM IST
భీమా కోరేగావ్ కేసులో గోన్సాల్వేస్, అరుణ్ ఫెరీరాలకు బెయిల్‌

భీమా కోరేగావ్ కేసుకు సంబంధించిన ఎల్గార్ పరిషత్ కేసులో ఇద్దరు నిందితులకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. 2018 భీమా కోరేగావ్ హింసాకాండలో నిందితులైన వెర్నాన్ గోన్సాల్వేస్, అరుణ్ ఫెరీరాలను బెయిల్‌పై విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. విచారణ సందర్భంగా.. ఆరోపణలు తీవ్రమైనవి కాబట్టి.. నిందితులిద్దరూ ఐదేళ్లుగా కస్టడీలో ఉన్నారని కోర్టు పేర్కొంది. బెయిల్ షరతులను ప్రత్యేక కోర్టు నిర్ణయిస్తుంది. ఈ సందర్భంగా వారి పాస్‌పోర్ట్‌ను జప్తు చేస్తారు. నిందితులిద్దరూ ఎన్‌ఐఏతో టచ్‌లోనే ఉంటారు. బెయిల్‌పై ఉన్నా గోన్సాల్వేస్, ఫెరీరా మహారాష్ట్ర నుండి బయటకు వెళ్లలేరని.. అయితే వారు తమ పాస్‌పోర్ట్‌లను పోలీసులకు సరెండర్ చేస్తార‌ని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ సుధాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

నిందితులిద్దరూ ఒక్కో మొబైల్‌ను ఉపయోగించాలని, కేసును విచారిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కి తమ చిరునామాను తెలియజేయాలని బెంచ్ ఆదేశించింది. హింసను ప్రేరేపించారనే అభియోగాలపై యూఏపీఏ చట్టం కింద 2018 ఆగస్టులో గొన్సాల్వెస్‌, ఫెరెరాను ఎన్‌ఐఏ అరెస్ట్‌ చేసింది. అప్పటి నుంచి వారు ముంబైలోని తలోజా జైలులో ఉన్నారు. వారిద్దరి బెయిల్‌ పిటిషన్‌ను 2021 డిసెంబర్‌లో బాంబే హైకోర్టు తిరస్కరించింది. తమ బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురైన తర్వాత నిందితులిద్దరూ బాంబే హైకోర్టు ఆదేశాలను స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈ కేసు డిసెంబరు 31, 2017న పూణెలో జరిగిన ఎల్గార్ పరిషత్ కాన్‌క్లేవ్‌కు సంబంధించినదని.. దీనికి మావోయిస్టులు నిధులు సమకూర్చారని పూణే పోలీసులు తెలిపారు. మరుసటి రోజు పూణేలోని కోరేగావ్-భీమా యుద్ధ స్మారకం వద్ద జరిగిన స‌మావేశంలో రెచ్చ‌గొట్టే ప్రసంగాల కారణంగా హింస చెల‌రేగింద‌ని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ఇది వరకే వరవరరావుకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. మరో నిందితుడు గౌతమ్‌ నవలఖాను గృహనిర్బంధంలో ఉంచేందుకు అనుమతించింది.


Next Story