రూ.24,000 కోట్లతో కొత్త పథకం.. 1.7 కోట్ల మంది రైతులకు లబ్ధి
దేశంలో రైతుల సంక్షేమానికి సంబంధించి కేంద్ర మరో కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.
By అంజి
రూ.24,000 కోట్లతో కొత్త పథకం.. 1.7 కోట్ల మంది రైతులకు లబ్ధి
దేశంలో రైతుల సంక్షేమానికి సంబంధించి కేంద్ర మరో కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. వ్యవసాయం దాని అనుబంధ రంగాలను అభివృద్ధి చేసేందుకు దేశంలోని 100 జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఏటా రూ.24 వేల కోట్ల వ్యయంతో.. ఈ ఏడాది నుంచి ఆరేళ్ల పాటు ఈ పథకాన్ని అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది.
ఈ పథకం అమలు వల్ల దేశ వ్యాప్తంగా 1.70 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ప్రతీ రాష్ట్రంలో కనీసం ఒక జిల్లాను పీఎం ధన్ ధాన్య యోజన పథకం కింద వ్యవసాయ జిల్లాగా అభివృద్ధి చేస్తామని కేంద్రం వెల్లడించింది. ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలలో కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. పీఎం ధన్ ధాన్య కృషి యోజనకు ఎంపికై జిల్లాలో పథకం అమలు పురోగతిని 117 పెర్ఫామెన్స్ ఇండికేటర్ల ద్వారా పర్యవేక్షణ చేయనున్నారు. కేంద్రంలోని 11 మంత్రిత్వ శాఖల్లో అమల్లో ఉన్న 36 పథకాలను మిళితం చేసి ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.
పంట ఉత్పాదకత తక్కువగా ఉండటం, అన్ని రుతువుల్లోనూ పంట సాగుబడి చేయకపోవడం, రుణ లభ్యత అత్యంత తక్కువగా ఉండటం అనే మూడు కీలక సూచీల ఆధారంగా.. పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకానికి దేశంలో 100 జిల్లాలను కేంద్రం ఎంపిక చేయనుంది. దేశంలో వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, పంట వైవిధ్యాన్ని ప్రోత్సహించడం, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను అమలు చేయడం, పంట కోత తర్వాత నిల్వ చేసే అవకాశాలను మరింత బలోపేతం చేయడం, అన్నదాతలకు దీర్ఘకాలిక, స్వల్ప కాలిక రుణాల లభ్యతను పెంచడం, నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపర్చడం ఈ పథకం ముఖ్య లక్ష్యం.