అఫ్గానిస్థాన్ నుంచి ఢిల్లీకి వచ్చిన వారిలో 16 మందికి కరోనా..!

16 Afghan evacuees test Covid positive.తాలిబ‌న్లు అఫ్గానిస్థాన్‌ను హ‌స్త‌గ‌తం చేసుకున్న క్ర‌మంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Aug 2021 6:14 AM GMT
అఫ్గానిస్థాన్ నుంచి ఢిల్లీకి వచ్చిన వారిలో 16 మందికి కరోనా..!

తాలిబ‌న్లు అఫ్గానిస్థాన్‌ను హ‌స్త‌గ‌తం చేసుకున్న క్ర‌మంలో అక్క‌డ భ‌యాన‌క ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. రక్షణ కరువడంతో అఫ్గాన్‌ పౌరులతోపాటు, వివిధ కారణాల దృష్ట్యా అక్కడికి వెళ్లినవారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వలసబాటపట్టారు. ఈ నేప‌థ్యంలో అఫ్గానిస్థాన్‌ నుంచి భారతీయుల తరలింపును కేంద్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. అఫ్గానిస్తాన్ రాజధాని కాబుల్‌లో చిక్కుకున్న 78 మందిని ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీకి తీసుకువ‌చ్చారు. కొవిడ్ నిబంధ‌న‌ల మేర‌కు వీరిని ఢిల్లీలోని చావ్లాలో ఏర్పాటు చేసిన ఇండో-టిబెట‌న్ బోర్డ‌ర్ పోలీసు క్వారంటైన్ కేంద్రానికి త‌ర‌లించారు. అనంత‌రం వారికి ప‌రీక్ష‌లు నిర్వ‌హంచ‌గా.. 16 మందికి పాజిటివ్‌గా నిర్థార‌ణ అయ్యింది.

కరోనా వచ్చిన వారు కేంద్రమంత్రి హర్దీప్ పూరిని కలిశారు. క‌రోనా వచ్చిన వారిలో ఎటువంటి ల‌క్ష‌ణాలు లేవ‌ని వైద్యులు తెలిపారు. కాబూల్ నుంచి వచ్చిన వారిలో 25 మంది భారతీయులు మిగిలిన వారు అఫ్ఘాన్ సిక్కు, హిందూ కుటుంబాలకు చెందినవారు కూడా ఉన్నారు. కాబుల్‌లోని గురుద్వారా నుంచి గురు గ్రంథ సాహిబ్‌కు చెందిన మూడు ప్రతులను ఢిల్లీకి తీసుకు వచ్చి కేంద్రమంత్రి హర్దీప్ సింగ్‌పురికి అప్పగించారు.

అఫ్గానిస్థాన్‌లో చిక్కుకుపోయిన భార‌తీయుల‌ను స్వ‌దేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్ర‌త్యేక విమానాలు న‌డుపుతోంది. ఈ మిష‌న్‌కు ఆప‌రేష‌న్ దేవీ శ‌క్తి అనిపేరు పెట్టారు. అఫ్గానిస్థాన్‌ నుంచి ఇప్పటివరకు 626 మంది భారత్‌కు వచ్చారని కేంద్ర మంత్రి హరిదీప్‌సింగ్‌ పూరి తెలిపారు. అందులో 228 మంది భారతీయులు ఉన్నారని, మరో 77 మంది ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన సిక్కులు ఉన్నారని వెల్లడించారు. మిగిలినివారిలో విదేశీయులతోపాటు భారత ఎంబసీకి చెందినవారు ఉన్నారన్నారు.

Next Story