అమర్‌నాథ్‌లో ఆకస్మిక వరద.. 15కు చేరిన మృతుల సంఖ్య
15 Dead due to huge rainfall floods in Amarnath Pilgrimage.ప్రకృతికి కోపమొచ్చింది. మేఘాల గర్జనతో దక్షిణ కశ్మీర్
By తోట వంశీ కుమార్ Published on 9 July 2022 2:28 AM GMTప్రకృతికి కోపమొచ్చింది. మేఘాల గర్జనతో దక్షిణ కశ్మీర్ హిమాలయాల్లోని అమర్‌నాథ్ క్షేత్రానికి సమీపంలో పెను విషాదం చోటు చేసుకుంది. ఆకస్మిక వరద భీభత్సం సృష్టించింది. శుక్రవారం సాయంత్రం 5.30గంటల ప్రాంతంలో ఒక్కసారిగా కుండపోత వర్షం కురవడంతో వరద పోటెత్తింది. ఇప్పటి వరకు 15 మంది మరణించగా, మరో 40 మంది వరకు గత్లంతు అయినట్లు క్షేతస్థాయి అధికారి ఒకరు చెప్పారు. కొండపై నుంచి ఒక్కసారిగా భారీ ఎత్తున వర్షపు నీరు ముంచెత్తింది.
దీంతో కింది ప్రాంతంలో ఉన్న గుడారాలు కొట్టుకుపోయాయి. మృతుల్లో ఎక్కువ మంది యాత్రికులేనని తెలుస్తోంది. సమాచారం అందుకున్నపోలీసులు, కేంద్రబలగాలు, జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్‌డీఆర్ఎఫ్) సిబ్బంది యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. పలువురిని కాపాడారు. బాధితులను హెలికాప్టర్ల ద్వారా తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వర్షం కొనసాగుతుండడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది.
ఐటీబీపీ పీఆర్వో వివేక్ కుమార్ పాండే మాట్లాడుతూ.. అమర్‌నాథ్ గుహా ఎగువ ప్రాంతం నుంచి ఒక్కసారిగా వరద పోటెత్తింది. సహాయ బృందాలను అప్రమత్తం చేసి అక్కడ టెంట్లలో ఉన్న యాత్రికులను 10-15 నిమిషాల్లో బయటకు తీసుకువచ్చామని తెలిపారు.
ఆకస్మిక విపత్తు పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడి అక్కడ ప్రస్తుత పరిస్థితిని తెలుసుకున్నారు.
అమర్‌నాథ్‌లో మంచు లింగాన్ని దర్శించుకునేందుకు ప్రతి సంవత్సరం భక్తులు పోటెత్తుతారు. కరోనా కారణంగా 2020, 2021లో యాత్ర జరగలేదు. ఈ ఏడాది జూన్ 30న అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైంది. ఇప్పటి వరకు లక్ష మంది వరకు భక్తులు లింగాన్ని దర్శించుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. 43 రోజుల ఈ యాత్ర షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 11తో ముగియాల్సి ఉంది.