కోటి రూపాయలు గెలుచుకున్న 12 ఏళ్ల బాలుడు
ప్రముఖ గేమ్ షో కౌన్ బనేగా కరోడ్‌పతిలో సరికొత్త రికార్డును సృష్టించాడు ఓ బాలుడు.
By Medi Samrat Published on 29 Nov 2023 7:15 PM ISTప్రముఖ గేమ్ షో కౌన్ బనేగా కరోడ్‌పతిలో సరికొత్త రికార్డును సృష్టించాడు ఓ బాలుడు. 12 ఏళ్ల జూనియర్ కంటెస్టెంట్ మయాంక్ ఈ షోలో కోటి రూపాయలు గెలుచుకున్న అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. కౌన్ బనేగా కరోడ్‌పతి 15లో మయాంక్ ఆ అరుదైన ఫీట్ ను అందుకున్నాడు. హర్యానాలోని మహేంద్రగఢ్‌కు చెందిన మయాంక్ ఆడిన ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను ఛానల్ అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో పంచుకున్నారు. హోస్ట్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నుండి మయాంక్ కోటి రూపాయల చెక్ ను కూడా సొంతం చేసుకున్నాడు. ప్రైజ్ మనీ కాకుండా, మయాంక్ ఇంటికి సరికొత్త కారును కూడా తీసుకెళ్లాడు.
కోటి రూపాయల ప్రశ్నకు కరెక్ట్ సమాధానం ఇవ్వడంతో అతడి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. అమితాబ్ సర్ ముందు కూర్చుని ఆడే అవకాశం లభించడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని అతడు తెలిపాడు. ఇంత పెద్ద మొత్తంలో గెలిచిన అతి పిన్న వయస్కుడిగా నిలవడం నాకు, నా కుటుంబానికి గర్వకారణం అని మయాంక్ తెలిపాడు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా మయాంక్ ను అభినందించారు. హర్యానాలోని మహేంద్రగఢ్‌కు చెందిన మయాంక్ లాల్ తన నైపుణ్యంతో కోటి రూపాయల మొత్తాన్ని గెలుచుకుని రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని మనోహర్ లాల్ ఖట్టర్ అభినందించారు.