పెయింట్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. 11 మంది మృతి
ఢిల్లీలోని అలీపూర్‌లోని దయాల్‌పూర్ మార్కెట్‌లో గురువారం పెయింట్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో 11 మంది మరణించారు.
By అంజి Published on 16 Feb 2024 9:39 AM ISTపెయింట్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. 11 మంది మృతి
ఢిల్లీలోని అలీపూర్‌లోని దయాల్‌పూర్ మార్కెట్‌లో గురువారం పెయింట్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో 11 మంది మరణించారు. ఆసుపత్రిలో చేరిన నలుగురిలో ఒక పోలీసు సిబ్బంది ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ సమయంలో అతడు గాయపడ్డారు. ఢిల్లీ ఫైర్ సర్వీస్ (DFS) నుండి ఒక అధికారి మాట్లాడుతూ.. ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం గురించి సాయంత్రం 5.30 గంటల సమయంలో తమకు కాల్ వచ్చిందని, 22 ఫైర్ టెండర్లను సేవలో ఉంచామని తెలిపారు. ఘటనకు సంబంధించిన వీడియోలో, ఫ్యాక్టరీ నుండి భారీ మంటలు రావడం, పొగ మేఘాలు ఆ ప్రాంతాన్ని కప్పివేసాయి. పేలుడు కారణంగా సమీపంలోని కొన్ని ఇళ్లు, దుకాణాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. గాయపడిన వారిలో కొందరు ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అగ్నిప్రమాదానికి ముందు ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఇటీవల, జనవరి 26న ఢిల్లీలోని షహదారా ప్రాంతంలో బహుళ అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఓ ఇంట్లో మంటలు చెలరేగడంతో తొమ్మిది నెలల చిన్నారి సహా నలుగురు వ్యక్తులు ఊపిరాడక మరణించగా, ఇద్దరు గాయపడ్డారు. అదేవిధంగా, జనవరి 18న వాయువ్య ఢిల్లీలోని పితంపురాలో బహుళ అంతస్తుల భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో నలుగురు మహిళలు సహా ఆరుగురు మరణించారు.