36 ఏళ్లు జైలు జీవితం తర్వాత విడుదలైన 104 ఏళ్ల వృద్ధుడు.. ఏ నేరం చేశాడంటే..
పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా కరెక్షనల్ హోమ్‌లో 36 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపిన తర్వాత 104 ఏళ్ల వృద్ధుడు విడుదలయ్యాడు.
By Medi Samrat Published on 4 Dec 2024 3:30 PM ISTపశ్చిమ బెంగాల్‌లోని మాల్డా కరెక్షనల్ హోమ్‌లో 36 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపిన తర్వాత 104 ఏళ్ల వృద్ధుడు విడుదలయ్యాడు. విడుదల అనంతరం తన కుటుంబ సభ్యులతో గడుపుతూ తోటపని చేస్తానని చెప్పాడు. 1988లో భూవివాదం కేసులో తన సోదరుడిని హత్య చేశాడనే ఆరోపణపై రసిక్త్ మొండల్‌కు 1992లో మాల్డాలోని జిల్లా మరియు సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది.
హత్య అనంతరం అరెస్టు తర్వాత అతడు సుమారు ఒక సంవత్సరం పాటు బెయిల్‌పై విడుదలై బయట ఉన్నాడు. శిక్ష సమయంలో మరొకసారి పెరోల్ కూడా మంజూరయ్యింది. అయితే పెరోల్ వ్యవధి ముగిసిన తర్వాత మళ్లీ జైలుకు వెళ్లాడు. అయితే అతడు పలు సందర్భాలలో విడుదల కోసం చేసిన అభ్యర్థనలను హైకోర్టు తిరస్కరించింది.
మాల్దా జిల్లాలోని మానిక్‌చక్ నివాసి అయిన మొండల్.. మంగళవారం మాల్దా కరెక్షనల్ హోమ్ గేటు నుండి బయటకు వస్తూ విలేకరులతో మాట్లాడాడు. తాను ఇప్పుడు తోటపని / మొక్కల పెంపకం, కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడానికి పూర్తి సమయాన్ని కేటాయిస్తానని చెప్పాడు.
మీ వయస్సు ఎంత అని అడగగా.. మోండల్ 108 సంవత్సరాలు అని గొణిగాడు. కానీ అతనితో పాటు అతని కుమారుడు, అతని వయస్సు 104 అని సరిదిద్దాడు. రికార్డుల ప్రకారం అతని వయస్సు 104 అని కరెక్షనల్ హోమ్ అధికారులు తెలిపారు.
“నేను ఎన్ని సంవత్సరాలు జైలులో గడిపానో నాకు గుర్తు లేదు. ఇది ఎప్పటికీ అంతం కాదనిపించింది. నన్ను ఎప్పుడు ఇక్కడికి తీసుకువచ్చారో కూడా నాకు గుర్తులేదు.. ఇప్పుడు నేను బయటకు వచ్చాను.. నా అభిరుచికి న్యాయం చేయగలను.. నా ప్రాంగణంలో ఉన్న చిన్న తోటలో మొక్కలను పెంచుతాను.. నేను నా కుటుంబం.. మనవరాళ్లను ఎంతో కోల్పోయాను.. ఇప్పుడు వారితో ఉండాలనుకుంటున్నాను అని వృద్ధుడు పేర్కొన్నాడు.
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తన తండ్రిని విడుదల చేసినట్లు మోండల్ కుమారుడు ప్రకాష్ మోండల్ తెలిపారు. చాలా కాలం జైలులో గడిపిన తర్వాత.. మా న్యాయవాది తెలియజేసినట్లుగా ఖైదీగా ఉన్న సమయంలో ఎలాంటి అక్రమ చర్యలకు పాల్పడనట్లయితే.. ప్రతి ఖైదీ జైలు నుండి విడుదలకు అర్హులు. చివరకు నా తండ్రి విడుదలకు సుప్రీం కోర్టు మార్గం సుగమం చేసినందుకు సంతోషంగా ఉందిఅని కొడుకు చెప్పాడు.
మోండల్‌కు 72 సంవత్సరాల వయసులో జిల్లా మరియు సెషన్స్ కోర్టు మాల్డా 1992లో జీవిత ఖైదు విధించింది. అయితే కలకత్తా హైకోర్టులో విచారణ సందర్భంగా ఆయన బెయిల్‌పై విడుదలయ్యాడు. అయితే కిందికోర్టు యావజ్జీవ కారాగార తీర్పును హైకోర్టు సమర్థించడంతో తిరిగి కరెక్షనల్ హోంకు వెళ్లిపోయాడు. 2020లో అతనికి పెరోల్ మంజూరైంది కానీ 2021లో కరెక్షనల్ హోమ్‌కు తిరిగి వెళ్లి, గత నెలలో ఎస్సీ ఉత్తర్వులు జారీ చేసే వరకు లాక్ అప్‌లో ఉండిపోయాడు.