ఛత్తీస్‌గఢ్ దంతేవాడ జిల్లాలో నక్సల్స్ తెగబడ్డారు. మావోయిస్టులు ఐఈడీ పేల్చివేశారు. ఈ పేలుడులో ఒకరు మృతి చెందగా.. 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. రాయ్‌పూర్‌కు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాలెవాధి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘోటియా గ్రామ సమీపంలో గురువారం ఉదయం 7.30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. నారాయణపూర్ నుంచి దంతెవాడను కలుపుతూ నిర్మిస్తున్న రోడ్డు మార్గంలో ఈ పేలుడు సంభవించిందని జిల్లా ఎస్పీ అభిషేక్ పల్లవ తెలిపారు.
వాహనంలో ఉన్న మహిళతో సహా 12 మందికి గాయాలయ్యాయని, వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు ఎస్పీ తెలిపారు. భద్రతా దళాలే లక్ష్యంగా నక్సల్స్ ఐఈడీని పేల్చారని, పొరపాటున జనం వెళ్తున్న వాహనంపై దాడి చేసి ఉంటారని పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించినట్లు చెప్పారు. అక్కడ భద్రతా సిబ్బంది ఎప్పుడూ నాలుగు చక్రాల వాహనాలను వినియోగించరని తెలిపారు. కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు. కాగా.. దంతెవాడ, నారాయణపూర్ దక్షిణ ఛత్తీస్‌ఘడ్, బస్తర్ ప్రాంతంలోని ఏడు జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం ఉంది.