బాలకృష్ణ దర్శకత్వం వహించిన ‘నర్తనశాల’ టికెట్ ధర ఫిక్స్.. ఎంతంటే..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 21 Oct 2020 7:37 AM GMTటాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో రూపొందుకున్న పౌరాణిక చిత్రం నర్తనశాల. ఇందులో అర్జునుడిగా నందమూరి బాలకృష్ణ, ద్రౌపది గా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు నటించారు. చాలా ఏళ్ల క్రితం మొదలై మధ్యలో ఆగిపోయిన ఈ చిత్రానికి సంబంధించి బాలయ్య ఇటీవల ఓ అప్డేట్ ఇచ్చారు.
తండ్రి ఎన్టీఆర్ చిత్రాల్లో ‘నర్తనశాల’ చిత్రం అంటే బాలయ్యకు ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే ఆ చిత్రాన్ని రీమేక్ చేయాలని సంకల్పించారు. బాలక్రిష్ణ దర్శకత్వంలో ఎన్నో అంచనాల మధ్య మొదలైన ‘నర్తనశాల’ చిత్రం షూటింగ్ కొద్ది రోజులకే ఆగిపోయింది. కాగా.. అప్పుడు చిత్రీకరించిన దాదాపు 17 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్ర సన్నివేశాలను ప్రేక్షకులు, అభిమానులు వీక్షించడానికి వీలుగా ఈ విజయదశమి సందర్భంగా అక్టోబర్ 24న విడుదల చేయాలని నిర్ణయించారు.
అయితే.. ఓటీటీలో విడుదలవుతున్న ‘నర్తనశాల’ సినిమా టికెట్ ధరను రూ.50గా నిర్ణయించారు. ఇప్పటి వరకూ తన నటనతో మెప్పించిన బాలయ్యలోని దర్శకుడిని చూడాలంటే మాత్రం కచ్చితంగా రూ.50 చెల్లించి సినిమా చూడాల్సిందే. శ్రేయస్ ఈటీ ద్వారా ఈ సినిమా విడుదల అవుతుంది.
ఇదిలావుంటే.. ఈ సినిమా ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలని బాలకృష్ణ భావించారు. ఇక బాలయ్య అభిమానులైతే ఎంతైనా పెట్టి టికెట్ కొనవచ్చునని అన్నారు. దీంతో కొంత మంది అభిమానులు ఎక్కువ మొత్తం పెట్టి టికెట్ కొనాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వారి వివరాలను కూడా బాలకృష్ణ స్వయంగా ప్రకటిస్తారని వార్తలు వినపడుతున్నాయి.