'నర్తనశాల' ఫస్ట్ లుక్ విడుదల

By సుభాష్  Published on  20 Oct 2020 10:25 AM GMT
నర్తనశాల ఫస్ట్ లుక్ విడుదల

పౌరాణిక చిత్రాలలో శ్రీ రాముడైనా, శ్రీ కృష్ణుడైనా తెలుగు ప్రజలకు ముందుగా గుర్తొచ్చేది ఎన్టీఆర్‌. ఆయన నట వారసత్వాన్ని పునికి పుచ్చుకుని తండ్రికి తగ్గ తనయుడు అనించుకున్నారు నందమూరి బాలకృష్ణ. ఆయనకు తన తండ్రి ఎన్టీఆర్‌ చిత్రాల్లో 'నర్తనశాల' చిత్రం అంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే ఆ చిత్రాన్ని రీమేక్‌ చేయాలని సంకల్పించారు. బాలక్రిష్ణ, సౌందర్య కీలక పాత్రల్లో, బాలక్రిష్ణ స్వీయ దర్శకత్వంలో ఎన్నో అంచనాల మధ్య మొదలైన 'నర్తనశాల' చిత్రం షూటింగ్ కొద్ది రోజులకే ఆగిపోయింది. కాగా.. ఆ సినిమాకి సంబంధించిన 17 నిముషాల వీడియోను దసరా కానుకగా ఈ నెల 24న విడుదల చేయనున్నట్లు బాలక్రిష్ణ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

ఈ చిత్రంలో ద్రౌపతిగా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజు పాత్రలో శరత్‌బాబు, అర్జునుడిగా బాలకృష్ణ నటించారు. అయితే సినిమా కొంత‌భాగం షూటింగ్ పూరైన త‌ర్వాత హెలికాప్టర్‌ ప్రమాదంలో సౌందర్య మృతి చెందింది. దీంతో సినిమా షూటింగ్‌ ఆగిపోయింది. సినిమాలో ద్రౌప‌ది పాత్ర‌లో సౌంద‌ర్య‌ను త‌ప్ప మ‌రొక‌రిని ఊహించుకోవ‌డం క‌ష్ట‌మ‌ని చెప్పిన బాల‌కృష్ణ.. న‌ర్త‌న‌శాల‌ను నిలిపేశాడు.

ఇదిలా ఉంటే.. కాసేపటి క్రితం ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో బాలయ్య రూపం ఆకట్టుకుంటోంది. చేతిలో విల్లు, వెనుక బాణాలతో తీక్షణంగా చూస్తున్నారు బాలకృష్ణ. ప్రస్తుతం ఈ పిక్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.Next Story