నాని 'వి' మూవీ రివ్యూ..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Sep 2020 6:58 AM GMT
నాని వి మూవీ రివ్యూ..

నాని-సుధీర్ బాబు కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ 'వి'. థియేటర్లలో రిలీజ్ అవ్వాల్సిన న్యాచురల్ స్టార్ నాని 25వ సినిమా.. లాక్ డౌన్ కారణంగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలయ్యింది. ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదలైన బడా తెలుగు సినిమా కావడంతో సినీ ప్రేమికులు ఆసక్తి చూపించారు. ఈసారి వయోలెన్స్ ఎక్కువగా ఉంటుందని నాని ముందుగానే చెప్పాడు.. అనుకున్నట్లుగానే ట్రైలర్ లో కూడా చిన్నపాటి హింట్స్ ఇచ్చారు. ఇక సినిమాలో నాని-సుధీర్ బాబులు ఎలా చేశారు.. అసలు సినిమా కథ ఏమిటో తెలుసుకుందాం..!

కథ: డీసీపీ ఆదిత్య (సుధీర్ బాబు) లైఫ్ ఎంతో సాఫీగా సాగిపోతుంది. మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ గా అతడు బాగా ఫేమస్ అవుతూ ఉంటాడు. హైదరాబాద్ పాతబస్తీలో మత కల్లోలాలు జరుగుతుంటే అక్కడికెళ్లి 30 మందిని ప్రాణాలతో బయట పడేసినందుకు డీసీపీ ఆదిత్య మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంటూ ఉంటాడు. ఇలాంటి సమయంలో ఆ మతకల్లోలాల్లో విధులు నిర్వర్తించిన పోలీసు ఆఫీసర్ ను అతి కిరాతకంగా చంపేసి.. ఆదిత్యకు సవాల్ విసురుతాడు. తాను చంపబోయే వ్యక్తులకు సంబంధించిన క్లూలు ఇస్తూ డీసీపీ ఆదిత్యను ఆడుకునే వ్యక్తి 'విష్ణు'(నాని) అని తెలుసుకుంటాడు. ఇంతకూ విష్ణు ఈ దారుణ హత్యలు చేయడానికి కారణం ఏమిటి.. విష్ణు ను ఆదిత్య అడ్డుకుంటాడా..? అన్నది సినిమా చూస్తే అర్థమవుతుంది.

విశ్లేషణ:

ఓటీటీలలో విడుదలవుతున్న భారీ తెలుగు చిత్రం కావడంతో వి మీద అంచనాలు ఉన్నాయి. దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి సినిమాల పరంగా టేకింగ్ చాలా బాగుంటుందని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ ను సినిమా కథ కోసం ఎన్నుకోవడమన్నది సాహసం అనే చెప్పుకోవచ్చు. ఇతర భాషల్లో ఎన్నో క్రైమ్ థ్రిల్లర్ లు వస్తూ ఉంటాయి.. చివర్లో ఆ క్రైమ్ ను చేస్తున్న వారెవరో పట్టుకోవడం.. లేదంటే క్రైమ్ చేయడానికి కారణం తెలిసి ఆడియన్స్ థ్రిల్ కు ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఈ సినిమాలో థ్రిల్ ముఖ్యంగా మిస్ అవుతుంది. ఏదో వయొలెన్స్ ఎక్కువ ఉన్నంత మాత్రాన సినిమాను చూసేస్తారులే అనుకుంటే పొరపాటే అవుతుంది. కొద్ది సేపు క్రైమ్.. ఇంకొద్ది సేపు యాక్షన్.. ఇలా సినిమా సాగిపోతుంది మినహా థ్రిల్ కు గురిచేసే అంశాలు అంటూ ఏవీ లేవు.

సుధీర్ బాబు యాక్షన్ కు.. నాని నటన తోడవ్వడంతో సినిమా అలా.. అలా.. సాగిపోతుంది. కొన్ని కొన్ని సార్లు ఏదో మిస్ అయిన ఫీలింగ్ అందరికీ అనిపిస్తూ ఉంటుంది. అరే ఎన్ని సినిమాల్లో చూడలేదు.. హీరోకు అన్యాయం జరగడం.. అందుకు రివెంజ్ ను ప్లాన్ చేయడం.. అది ఒక పోలీసు ఆఫీసర్ సవాల్ గా స్వీకరించడం అన్నది చూసే ఉంటామని చెబుతూ ఉంటారు. అచ్చం అలాంటిదే..!

సినిమాను భారీగా తెరకెక్కించడమే చాలా ప్లస్ గా అనిపిస్తూ ఉంటుంది. ఇక ట్విస్ట్ లను ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం 'వి' నుండి అది ఆశించకపోవడమే బెటర్..!

సాంకేతిక వర్గం: నిర్మాతలు సినిమాకు బాగా ఖర్చు పెట్టారు. పిజి విందా కెమెరా పని తనం బాగుంది. టీజర్ లో ఎంతో గొప్పగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఉంది అని అనిపించినా సినిమా చూస్తున్నంత సేపు పెద్ద స్పెషల్ గా అనిపించలేదు.(సినిమా హాల్ లో చూడకపోవడం వలన కూడా అనిపించొచ్చు) సంగీతం అమిత్ త్రివేది అందించినా.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ థమన్ అందించాడు. దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ సినిమాలో కథ బలంగా ఉంటుంది.. కానీ ఈ సినిమాలో కథే పెద్ద మైనస్ గా అనిపించింది.

నాని-సుధీర్ బాబు మధ్యన నడిచే ఈ స్టోరీలో ఇతర పాత్రలు పెద్దగా గుర్తుండవు. నివేదా థామస్, అదితి రావు హైదరి, వెన్నెల కిశోర్ లు తమ పాత్రలకు న్యాయం చేశారు.

రేటింగ్ : 2.5/5

Next Story