నాని రేంజ్ మారబోతోందా?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 May 2020 6:44 PM IST
నాని రేంజ్ మారబోతోందా?

చాలా ఏళ్లుగా వారసుల హవా నడుస్తున్న టాలీవుడ్లో.. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా పరిశ్రమలోకి వచ్చి కేవలం తన ప్రతిభతో అందరినీ మెప్పించి స్టార్ ఇమేజ్ సంపాదించిన నటుడు నాని. అభిమానులు నేచురల్ స్టార్‌గా పిలుచుకునే నాని.. ఎక్కువ కొత్త, వర్ధమాన దర్శకులతోనే పని చేశాడు. కథల్ని బట్టి ముందుకు వెళ్లిపోయిన నాని.. ఎప్పుడూ కాంబినేషన్ల గురించి పెద్దగా ఆలోచించింది లేదు. చిన్న, మీడియం రేంజి దర్శకులతోనే అతను పెద్ద హిట్లు ఇచ్చాడు.

ఐతే నాని టాలెంటుకి పెద్ద దర్శకులతో కమర్షియల్ సినిమాలు చేస్తే అతడి స్థాయే వేరుగా ఉండేదని, ఇంకా పెద్ద స్టార్ అయ్యేవాడని జనాల్లో ఒక ఫీలింగ్ ఉంది. ఐతే రాజమౌళి దర్శకత్వంలో ‘ఈగ’లో ప్రత్యేక పాత్ర చేయడాన్ని మినహాయిస్తే అతను స్టార్ డైరెక్టర్లతో పని చేసింది లేదు. ఆ మధ్య కొరటాల శివతో నాని సినిమా ఒకటి ఉంటుందని వార్తలొచ్చాయి. కానీ అది కార్యరూపం దాల్చలేదు. మరే పెద్ద దర్శకుడితోనూ అతడికి సినిమా కుదర్లేదు.

ఐతే ఎట్టకేలకు నాని అభిమానుల నిరీక్షణ ఫలించి అతను ఓ స్టార్ డైరెక్టర్‌తో పని చేయబోతున్నట్లు సమాచారం. ఆ దర్శకుడు మరెవరో కాదు.. ఈ సంక్రాంతికి అల వైకుంఠపురములో’తో నాన్-బాహుబలి హిట్ కొట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్. కెరీర్ ఆరంభం నుంచి బడా స్టార్లతోనే సినిమాలు చేస్తూ వచ్చిన త్రివిక్రమ్.. మధ్యలో నితిన్‌తో ‘అఆ’ లాంటి మీడియం రేంజి సినిమా తీస్తే అది పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు మళ్లీ త్రివిక్రమ్ తన స్థాయిని కొంచెం తగ్గించుకోబోతున్నాడు. ఆయన విక్టరీ వెంకటేష్, నాని కలయికలో ఓ మల్టీస్టారర్ చేయబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

‘అల..’ తర్వాత నిజానికి త్రివిక్రమ్.. ఎన్టీఆర్‌తో సినిమా చేయాల్సింది. కానీ ‘ఆర్ఆర్ఆర్’ లేటవుతుండటంతో ఎన్టీఆర్ దాన్నుంచి బయటికి రావడానికి చాలా టైం పట్టేట్లుంది. ఈ లోపు వెంకీతో ఎప్పుడో ఉన్న కమిట్మెంట్‌ను ఇప్పుడు నెరవేర్చడానికి త్రివిక్రమ్ రెడీ అయ్యాడు. ఐతే ఆయన దగ్గర ఓ మల్టీస్టారర్ కథ ఉండటంతో మరో కథానాయకుడిగా నానీని తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ సినిమాతో వెంకీ కంటే నానికి ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం అతను శివ నిర్వాణతో ‘టక్ జగదీష్’ చేస్తున్న సంగతి తెలిసిందే.

Next Story