ఎయిర్ ఇండియా బిజినెస్ క్లాస్ ఫ్లైట్ లో ఓ బాక్స్.. ఎందుకంత ప్రత్యేకత..!

Mr. Ballot Box travels Business Class. ఢిల్లీ నుండి హైదరాబాద్‌కు ఎయిర్ ఇండియా విమానం AI839లో ప్రయాణించిన

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 July 2022 11:16 AM GMT
ఎయిర్ ఇండియా బిజినెస్ క్లాస్ ఫ్లైట్ లో ఓ బాక్స్.. ఎందుకంత ప్రత్యేకత..!

ఢిల్లీ నుండి హైదరాబాద్‌కు ఎయిర్ ఇండియా విమానం AI839లో ప్రయాణించిన వ్యక్తులకు సీటుపై ఓ పెట్టె కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఇది సాధారణ పెట్టె కాదు, రాబోయే ఐదేళ్లలో భారత రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసేది.

జూలై 12వ తేదీ రాత్రి 11:45 గంటలకు, 16వ రాష్ట్రపతి ఎన్నికలలో వినియోగించే బ్యాలెట్ బాక్స్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటుంది. జూలై 18న జరగనున్న 16వ రాష్ట్రపతి ఎన్నికల్లో ఉపయోగించనున్న బ్యాలెట్ బాక్స్‌ను ఎయిర్ ఇండియా ప్యాసింజర్ విమానం, AI839లో ఢిల్లీ నుండి హైదరాబాద్‌కు ఇందుకోసం.. కేటాయించిన ప్రత్యేక టిక్కెట్, సీటుతో వచ్చింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ అనుప్ చంద్ర మంగళవారం మొత్తం 29 రాష్ట్రాల రాజధానులకు బ్యాలెట్ బాక్సులను పంపించారు.

16వ రాష్ట్రపతి ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన బ్యాలెట్‌ బాక్స్‌ను ఢిల్లీలోని భారత ఎన్నికల కమిషన్‌ కార్యాలయం నుంచి తీసుకొచ్చారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, ఈ ఎన్నికలకు హైదరాబాద్‌ ఏఆర్‌వోగా వ్యవహరిస్తున్న ఉపేందర్‌రెడ్డి, అసిస్టెంట్‌ సెక్రటరీ సుధాకర్‌, సీఈవో కార్యాలయ అసిస్టెంట్‌ సెక్రటరీ విజయ్‌కిషోర్‌ ఢిల్లీకి వెళ్లారు. మంగళవారం భారత ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి అశ్వినీకుమార్‌ మొహల్‌, హైదరాబాద్‌ నుంచి వెళ్లిన బృందానికి బ్యాలెట్‌బాక్స్‌ను అందించారు. అనంతరం అధికారుల బృందం అర్థరాత్రి హైదరాబాద్‌కు చేరుకుంది. బ్యాలెట్‌బాక్స్‌ను కట్టుదిట్టమైన భద్రత నడుమ అసెంబ్లీలోని స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరిచారు.

2022 అధ్యక్ష ఎన్నికలు జూలై 18న జరగనున్నాయి. ఇద్దరు అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. మంగళవారం బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ము మద్దతు కోరుతూ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు నాయుడులను కలిశారు. బీజేపీ అభ్యర్థి ముర్ముకు మద్దతు ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ, టీడీపీ నిర్ణయించగా, ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు టీఆర్‌ఎస్‌ మద్దతు ప్రకటించింది. జూలై 2న సిన్హా తెలంగాణలో పర్యటించి కేసీఆర్‌ను, టీఆర్‌ఎస్ పార్టీ నేతలను కలిశారు.

















Next Story