మీ పీఎఫ్‌ బ్యాలెన్స్‌ తెలుసుకోవడం ఎలా..? నాలుగు పద్దతుల్లో మీ ఇంట్లో ఉండే తెలుసుకోవచ్చు

How To Know PF Balance. పీఎఫ్‌ అకౌంట్‌లో ఉన్న బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నాలుగు పద్దతులను అందుబాటులో ఉంచింది

By Medi Samrat  Published on  5 March 2021 6:04 AM GMT
How To Know PF Balance

ప్రావిడెండ్‌ ఫండ్‌ (పీఎఫ్‌).. ఇది ఉద్యోగులకు ఎంతో భరోసా లాంటిది. ఉద్యోగులకు రిటైర్మెంట్‌ తర్వాత వారికి ఆసరాగా ఉంటుంది. అందుకే ఉద్యోగులు తమ భవిష్య నిధి (పీఎఫ్‌) డబ్బులను చివరి వరకు తమ అకౌంట్‌ నుంచి తీసేందుకు పెద్దగా ఇష్టపడరు. ఎందుకంటే ఉద్యోగ విరమణ తర్వాత వారికి పీఎఫ్ సొమ్ము ఎంతగానో ఉపయోగపడుతుంది. పైగా పీఎఫ్‌ ఖాతాలో డబ్బులకు వడ్డీ కూడా ఎక్కువగా వస్తుండటంతో ఆ సొమ్మను తీయకుండా అలాగే ఉంచుతారు. కానీ ప్రతి ఏడాది తమ ఖాతాలో వార్షిక వడ్డీ ఎంత జమ అవుతుంది..? దానిని ఎలా చెక్‌ చేసుకోవాలో అనే విషయం కొందరికి తెలిసినా.. చాలా మందికి తెలియని విషయం. తమ పీఎఫ్‌ అకౌంట్‌లో ఉన్న బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నాలుగు పద్దతులను అందుబాటులో ఉంచింది. అవేంటో చూద్దాం.

ఉమంగ్ యాప్ ద్వారా..

పీఎఫ్‌ ఖాతా యొక్క బ్యాలెన్స్‌ వివరాలు తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఉమాంగ్‌ అనే యాప్‌ను రూపొందించింది. ఇది యాప్‌ ప్లేస్టోర్‌, యాపిల్‌ యాప్‌స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత UAN వివరాలతో లాగిన్‌ అయి ఈపీఎఫ్‌వో ఖాతాలో ఉన్న సొమ్ము గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావడం ద్వారా..

పీఎఫ్‌ బ్యాలెన్స్‌ తెలుసుకోవాలంటే మరో విధానం కూడా ఉంది. ముందుగా ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌ www.epfindia.gov.in - ఓపెన్ చేయాలి. ఆ తర్వాత ఈ-పాస్‌బుక్ పై క్లిక్ చేయాలి.

- ఈ పాస్‌బుక్‌పైన క్లిక్‌ చేయగానే కొత్త ట్యాబ్‌ ఓపెన్‌ అవుతుంది. ఆ కొత్త పేజీలో UAN నంబర్‌, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ కావాలి.

- లాగిన్‌ కాగానే మన ఖాతాలో ఉన్న ప్రావిడెంట్‌ ఫండ్‌ మొత్తం, వడ్డీ మొత్తానికి సంబంధంచి వివరాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి.

- ఈ వివరాలను పీడీఎఫ్‌ (PDF) ఫార్మాట్‌లో కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఎస్ఎంఎస్ ద్వారా..

ఇక పీఎఫ్‌ బ్యాలెన్స్‌ SMS ద్వారా తెలుసుకోవాలంటే పీఎఫ్‌ అకౌంట్‌కు, బ్యాంక్‌ ఖాతాకు ఒకే మొబైల్‌ నెంబర్‌ అనుసంధానమై ఉండాలి. లేకపోతే వివరాలు తెలుసుకోలేము. అదే నెంబర్‌ ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌లో కూడా అప్‌డేట్‌ అయి ఉంటే మీ మొబైల్‌ నెంబర్‌కు తరుచుగా పీఎఫ్‌ వివరాలకు సంబంధించి మెసేజ్‌లు వస్తూ ఉంటాయి. ఒక వేళ మెసేజ్‌లు రాకపోతే మీ రిజిస్టర్‌ మొబైల్‌ నెంబర్‌ నుంచి EPFOHO UAN అని టైప్ చేసి 77382 99899 నెంబర్‌కు మెసేజ్ చేయాలి. వెంట‌నే పీఎఫ్ బ్యాలెన్స్‌, వ‌డ్డీ వివ‌రాల‌తో రిజిస్టర్‌ మొబైల్‌ నెంబర్‌కు మెసేజ్‌ వస్తుంది.

మిస్డ్‌కాల్‌ ద్వారా..

ఈపీఎఫ్‌వో ఖాతాదారులు తమ రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌ నుంచి మిస్డ్‌ కాల్‌ ఇచ్చి పీఎఫ్‌ అకౌంట్‌లోని బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకోవచ్చు. ఖాతాదారులు తమ రిజిస్టర్‌ మొబైల్‌ నెంబర్‌ నుంచి 011-22901406కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. పీఎఫ్ నెంబ‌ర్ స‌హా.. ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉంది. వ‌డ్డీ మొత్తం ఎంత అన్న వివ‌రాల‌తో కూడా మెసేజ్ వెంట‌నే మీ ఫోన్‌కు వ‌స్తుంది.


Next Story