కరోనా సెకండ్ వేవ్ భయం - ఏమాత్రం అలసత్వం వద్దు

Corona Second Wave. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి బారినుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాము.

By Medi Samrat  Published on  10 Dec 2020 8:30 AM IST
కరోనా సెకండ్ వేవ్ భయం - ఏమాత్రం అలసత్వం వద్దు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి బారినుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాము. జనజీవనం దాదాపు మామూలు పరిస్థితికి వచ్చింది. అయితే కరోనా ముప్పు మాత్రం ఇప్పటికీ పూర్తిగా తొలగిపోలేదని వైద్యులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కాస్త తగ్గినట్టు అనిపిస్తున్నా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరోనా ప్రారంభ దశలో తీవ్రమైన జ్వరం, దగ్గు, జలుబు, శ్వాస పీల్చడంలో ఇబ్బంది, రుచి, వాసన కోల్పోవడంలాంటి లక్షణాలు ఉండేవి. కానీ, ప్రస్తుతం చలికాలం కావడంతో అందరికీ జలుబు, జ్వరం, దగ్గు వంటి సమస్యలు వస్తుంటాయి. ఇవి సాధారణ సమస్యలు అనుకుని అంత ఈజీగా తీసిపారేయకూడదు. ఎందుకంటే ఎలాంటి లక్షణాలు లేకుండానే మళ్లీ కరోనా వైరస్‌ సోకే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కరోనా నుంచి కోలుకున్నవారు కూడా మరింత అప్రమత్తంగా ఉండాలి. స్వీయ నియంత్రణ పాటించడం, ఒకరికి ఒకరు భౌతిక దూరాన్ని పాటించడంతోపాటు తప్పనిసరిగా మాస్క్‌ వాడడం, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడంతోనే కరోనా బారినుంచి తప్పించుకునే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.

సెకండ్ వేవ్ భయం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి

కరోనా వైరస్ ప్రారంభమైన సమయంలో ఉన్న భయం, అప్రమత్తత, జాగ్రత్తలు ప్రస్తుతం ప్రజల్లో కనిపించడం లేదు. భౌతిక దూరం పాటించడం, మాస్క్‌ ధరించడం విషయాలపై చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కరోనా కేసులు తగ్గుతున్నట్టు కనిపిస్తున్నా.. కొన్ని జిల్లాల్లో మాత్రం మళ్లీ పెరుగుతున్నాయి. చలికాలం కావడంతో కరోనా సెకండ్‌ వేవ్‌ కూడా ఉండొచ్చని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. త్వరలోనే వ్యాక్సిన్ వచ్చినా దాని ప్రభావం ఏమేరకు ఉంటుందో చెప్పలేం కాబట్టి ప్రజలు కరోనా ప్రారంభ సమయంలో అప్రమత్తంగా ఉన్నట్టే మరికొంత కాలం జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాలి.

చలికాలంలో సాధారణ రోగాలకు కరోనా లక్షణాలకు తేడా గమనించుకోవాలి

దగ్గు, జలుబు, జ్వరం, విరేచనాలు, వాసన, రుచి కోల్పోవడం లాంటివి కరోనా లక్షణాలు. అలాగే సాధారణ జలుబులో రన్నింగ్‌ నోస్‌ (ముక్కు నుంచి నీరు కారడం) ఉంటుంది. కరోనా లక్షణంలో ఇది ఉండదు. కాబట్టి చలి కాలంలో వచ్చే సాధారణ జలుబు, దగ్గులకు తోడు కొవిడ్‌ తాలూకు ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయేమో గమనించాలి. అలాగే క్రమేపీ లక్షణాల తీవ్రత పెరుగుతుందేమో చూసుకోవాలి. మన శరీరంలో ఆక్సిజన్‌ లెవెల్స్ ను ఆక్సీమీటర్‌ సహాయంతో పరీక్షించుకుంటూ ఉండాలి. సాధారణ జలుబు ఐదు రోజులకు మించి కొనసాగి, తీవ్రత పెరుగుతూ ఉంటే కరోనా అని భావించాలి. కాబట్టి సెకండ్‌ వేవ్‌ సమయంలో జలుబు, దగ్గు, జ్వరం, నీళ్ల విరేచనాలు, తలనొప్పి, బలహీనత... ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే కరోనా పరీక్ష చేయించుకోవాలి.

కరోనా మరోసారి రాకుండా జాగ్రత్తలు

కరోనా వచ్చి కోలుకున్న వ్యక్తుల్లో ఆ ఇన్‌ఫెక్షన్‌ పట్ల ఇమ్యూనిటీ ఎంత కాలం పాటు కొనసాగుతుందన్న దానిపై స్పష్టత లేదు. కాబట్టి కరోనా రెండోసారి వచ్చే అవకాశం లేదనుకోవడం పొరపాటు. ఒకసారి కరోనా వచ్చి తగ్గినా, రెండోసారి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రెండోసారి కరోనా వచ్చినవారి సంఖ్య పెరుగుతున్న విషయం మనం చూస్తూనే ఉన్నాము. కాబట్టి ముందు కరోనా వచ్చి కోలుకున్నవారు కూడా మరింత జాగ్రత్తగా ఉండాలి.

తప్పనిసరైతేనే గానీ రద్దీ ప్రదేశాలకు వెళ్లవద్దు:

కరోనా వచ్చిన తొలి రోజుల్లో తీసుకున్న జాగ్రత్తలనే మరో రెండు మూడు నెలలు పాటించడం చాలా అవసరం. మరీ ముఖ్యంగా జనం ఎక్కువగా గుమికూడే ప్రాంతాలకు దూరంగా ఉండాలి. ఒకవేళ అలాంటి ప్రాంతాలకు తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే ముఖానికి మాస్కు ధరించడంతోపాటు అక్కడి భౌతిక దూరం పాటించాలి. ఒకవేళ ఇప్పటికే ఏదైనా జనసమ్మర్థమైన ప్రాంతానికి వెళ్లినట్టయితే మరింత జాగ్రత్తగా ఐసోలేషన్ లో ఉండాలి. ఇంట్లో కుటుంబ సభ్యులతో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏమైనా కరోనా లక్షణాలు కనిపిస్తున్నట్టు గుర్తించినట్టయితే వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలి. కరోనా సెకండ్‌ వేవ్‌ నియంత్రణకు ఇది ఎంతో కీలకమైనది.

మాస్కును మించిన ఆయుధం లేదు:

కరోనాను ఎదుర్కొనడంలో ప్రస్తుతం మాస్కును మించిన ఆయుధం లేదు. ప్రస్తుతం చాలా మంది ముఖానికి మాస్కు పెట్టుకోవడం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ పెట్టుకున్నా మాస్కును సరైన పద్దతిలో ఉంచుకోవడం లేదు. మాస్కును ముఖానికి పెట్టిన తర్వాత తరచూ తాకవద్దు. మాస్కు తొలగించేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి.

* అంతేకాకుండా ఇతరులతో కనీసం 6 అడుగులు భౌతిక దూరం పాటించడం, ఏదైనా కొత్త వస్తువులు లేదా బయట నుంచి వచ్చిన వస్తువులను తాకిన ప్రతిసారి చేతులను శుభ్రంగా సబ్బు నీటితో శుభ్రం చేసుకోవాలి లేదా శానిటైజర్ ఉపయోగించాలి.

* చలికాలం కావడంతో మనం తీసుకునే ఆహారం పట్ల కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఆహారం వేడివేడిగా ఉండేలా చూసుకోవాలి. ప్రతిరోజూ గోరువెచ్చని నీటినే తాగండి

* చలికాలంలో జలుబు రావడం అనేది సాధారణమైన విషయమే. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో జలుబును నిర్లక్ష్యం చేయకూడదు. వేడి నీటితో ఆవిరిపట్టడం మంచిది. ఇలా చేయడం వల్ల కరోనా వైరస్‌తో పాటు ఇతరత్రా ఇన్‌ఫెక్షన్ల నుంచి కూడా రక్షణ పొందవచ్చు. ఉదయం పూట కనీసం 15 నిమిషాలు ఎండలో ఉండడం మంచిది.

* వైరస్ ను ఎదుర్కొనడంలో మన శరీరానికి రోగనిరోధక శక్తి చలా అవసరం. కాబట్టి అందుకు అనుగుణంగా మన ఆహార అలవాట్లను మార్చుకోవాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయడం, యోగా చేయడం మంచిది. ప్రస్తుతం జిమ్ సెంటర్లు, పార్కులు తెరిచినప్పటికీ ఇంట్లోనే వ్యాయామాలు చేసుకోవడం ఉత్తమం.

* ఒకవేళ మల్టీవిటమిన్‌ ట్యాబ్లెట్లు వాడాలంటే వైద్యుల సూచన మేరకే ఉపయోగించాలి. మరీ ఎక్కువగా మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు తీసుకోవడం వల్ల కూడా శరీరంలో ఆస్కార్బిక్‌ యాసిడ్‌ మోతాదు పెరిగి, ఇతరత్రా మూత్ర సంబంధమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.


Next Story