బ్రతకాలనే ఆశ ఉండాలే కానీ ఏదైనా చేయగలం. అలా బొగ్గు గని కూలిపోవడంతో ఇరుక్కుపోయిన వాళ్లు.. ఏకంగా 20 గంటల పాటూ తవ్వుకుంటూ వచ్చి బయట ప్రపంచాన్ని చూడగలిగారు. బొగ్గు గనిలో చిక్కుకున్న నలుగురు మార్గం కోసం 20 గంటలు తవ్వి దాని నుంచి బయటపడ్డారు. జార్ఖండ్‌లోని బొకారో జిల్లాలోని చందన్‌కియారి బ్లాక్‌లోని తిలతాండ్‌కు చెందిన ఆరుగురు వ్యక్తులు శుక్రవారం పర్బత్‌పూర్‌లోని భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్) చెందిన వదిలేసిన గనిలో అక్రమంగా తవ్వకాలు జరిపారు. ఈ సందర్భంగా గనిలో ఒక భాగం కూలడంతో అందులో చిక్కుకున్నారు. అనంతరం ఇద్దరు వ్యక్తులు ఎలాగోలా బయటపడ్డారు. గని లోపల చిక్కుకున్న మిగతా నలుగురి జాడ తెలియలేదు.
సమాచారం అందుకున్న బీసీసీఎల్ అధికారులు లక్ష్మణ్ రాజ్వర్ (42), అనాది సింగ్ (45), రావణ రాజ్వర్ (46), భరత్ సింగ్ (45) కోసం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. అయితే ఈ నలుగురిని గుర్తించడంలో విఫలమయ్యారు. కానీ శుక్రవారం నుంచి గనిలో చిక్కుకున్న నలుగురు వ్యక్తులు బయటపడే మార్గం కనుగొనేందుకు 20 గంటలకుపైగా తవ్వారు. చివరకు సోమవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఆ నలుగురు సురక్షితంగా గని నుంచి బయటకు వచ్చారని ఎస్పీ చందన్ కుమార్ ఝా తెలిపారు. ఘటన జరిగిన వెంటనే ఇద్దరు వ్యక్తులు బయటకు రాగా.. మిగిలిన నలుగురి ఆచూకీ కోసం ఎంతగా ప్రయత్నించినా ఆచూకీ లభించలేదు. పర్బత్‌పూర్ కోల్ బ్లాక్ ఎలక్ట్రోస్టీల్ ప్లాంట్ నిర్వహణలో ఉందని.. దీనిని బీసీసీఎల్ కొనుగోలు చేసిందని పోలీసు అధికారి తెలిపారు.