Fact Check : ముస్లిం విద్యార్థులు అక్కడ ఉచితంగా ఉండొచ్చా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 May 2020 8:02 AM IST
Fact Check : ముస్లిం విద్యార్థులు అక్కడ ఉచితంగా ఉండొచ్చా..?

కరోనా మహమ్మారి భారతదేశంలో తీవ్ర రూపం దాలుస్తున్నప్పటి నుండి మతాలకు సంబంధించిన ఫార్వర్డ్ మెసేజీలు విపరీతంగా వైరల్ అవుతూ ఉన్నాయి. నిజమో కాదో కూడా తెలుసుకోకుండా కొందరు కమ్యూనల్ యాంగిల్ లో ఉన్న మెసేజీలను వైరల్ చేస్తూ ఉన్నారు. ఈ మధ్యనే లాక్ డౌన్ లో సడలింపులు చేస్తూ ఉన్నారు.. ఇలాంటి సమయాల్లో ఒకరి మీద మరొకరికి విద్వేషం రెచ్చగొట్టే మెసేజీలను ఆపడం లేదు. తాజాగా మరో మెసేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ హాస్టల్ కు సంబంధించిన ఫోటోను పోస్టు చేసి 'ఇక్కడ హిందువులు, ఇతర మతాల వాళ్లు ఉండడానికి వీలు లేదు' అంటూ జె.ఎన్.యు. కు చెందిన హాస్టల్ అని చెప్పారు. ఇంతకూ ఇది నిజమేనా..?

నిజమెంత:

వాట్సప్ లో వైరల్ అవుతున్న మెసేజ్ ఏమిటంటే:

This is not a five star hotel. This is hostel constructed by Congress government in 2012 for JNU students from J & K. It has 400 rooms.

In this hostel, no Hindus or other religion can stay. Islam students f on JK will stay free of cost ad study here on the cost our whole Indian tax payers money.

After completing the course, they will shout slogans against Indian nation. What a secular party is Congress?”

ఇది ఫైవ్ స్టార్ హోటల్ కాదు. ఈ హాస్టల్ ను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2012లో నిర్మించింది. జమ్మూ అండ్ కాశ్మీర్ కు చెందిన విద్యార్థుల కోసమే 400 గదులను నిర్మించారు. ఈ హాస్టల్ లో కేవలం ముస్లింలు మాత్రమే ఉంటారు. ఇతర మతాలకు చెందిన వాళ్లకు ఉండేందుకు వీలు ఉండదు. భారత్ కు చెందిన టాక్స్ పేయర్స్ డబ్బులతో నిర్మించిన ఈ బిల్డింగ్ లో జమ్మూ అండ్ కాశ్మీర్ కు చెందిన విద్యార్థులు చదువుకుని దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు. కాంగ్రెస్ పార్టీ సెక్యులరేనా..? అంటూ వైరల్ అవుతోంది ఈ పోస్టు.

వైరల్ అవుతున్న పోస్టు 'పచ్చి అబద్ధం'.

ఈ ఫోటోలు జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ(ఢిల్లీ)కి చెందిన ఫోటోలుగా చెబుతూ ఉన్నారు. కానీ ఈ బిల్డింగ్ ఢిల్లీ లోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీకి చెందినది. గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా అది జామియా కు చెందిన బిల్డింగ్ అని తెలుస్తోంది.

జామియాలో 2017లో జమ్మూ అండ్ కాశ్మీర్ విద్యార్థుల కోసం ఈ హాస్టల్ ను లాంచ్ చేశారు. మెసేజీలో చెబుతున్నట్లుగా జమ్మూ కాశ్మీర్ కు చెందిన విద్యార్థులు ఇక్కడ 'ఉచితంగా ఉండలేరు'. హాస్టల్ లో కేవలం జమ్మూ కాశ్మీర్ కు చెందిన విద్యార్థులు, ముస్లిం విద్యార్థులే ఉండరు. గూగుల్ సెర్చ్ లో ఈ బిల్డింగ్ జామియా లోని మహిళల హాస్టల్ అని తేలింది. ఈ హాస్టల్ కట్టడాన్ని 2012లో మొదలుపెట్టారని 'ది హిందూ' తమ కథనంలో స్పష్టం చేసింది. జమ్మూ కాశ్మీర్ కు చెందిన మహిళా విద్యార్థినులే కాకుండా ఇక్కడ ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థినులు కూడా ఉంటారు. కేవలం ఒక అప్లికేషన్ ను ఇచ్చి.. అక్కడ ఉండవచ్చని తెలుస్తోంది. యూనివర్సిటీకి చెందిన అఫీషియల్ వెబ్ సైట్ లో కూడా “newly built 700-bedded hostel for bonafide female students of Jamia Millia Islamia.” అని ఉంది.

మెసేజీలో వైరల్ అవుతోందంతా పచ్చి అబద్ధమని జామియా మిలియా యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్స్ రెండో సంవత్సరం చదువుతున్న హష్మత్ నైయారీన్ తెలిపింది. తాను బీహార్ కు చెందిన విద్యార్థిని అని.. తాను జమ్మూ కాశ్మీర్ హాస్టల్ లోనే ఉన్నానని తెలిపింది. ముస్లింలు కాని వారు, నాన్-కాశ్మీరీలు కూడా అక్కడ ఉంటున్నారని విద్యార్థిని తెలిపింది. ఎవరూ కూడా ఉచితంగా ఉండడానికి వీలు లేదని తెలిపింది. తాను 15000 హాస్టల్ ఫీజును ఒక సెమిస్టరుకు చెల్లించానని హాస్టల్ ఫీజు, ఫుడ్.. అన్నిటికీ కలిపి అని చెప్పుకొచ్చింది.

జమ్మూ కాశ్మీర్ హాస్టల్ లో ఉంటున్న మరో విద్యార్థిని వృందా బక్షి కూడా తమ హాస్టల్ లో మతానికి సంబంధించిన తేడాలు లేవని, ఒకటిన్నర సంవత్సరంగా ఉంటున్న తాను ఎటువంటి విబేధాలు చూడలేదని తెలిపింది. ఎవరైనా హాస్టల్ అప్లికేషన్ వేయొచ్చునని.. అధికారులు చిన్న ఇంటర్వ్యూ చేసి.. రూమ్స్ అలాట్ చేస్తారని బక్షి తెలిపింది. అయితే ఈ ప్రాసెస్ మొత్తం పూర్తీ అవ్వడానికి రెండు నెలలు పడుతుందని.. వైరల్ అవుతున్న మెసేజీ పచ్చి అబద్ధమని ఆమె కొట్టి పారేసింది.

కాబట్టి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెసేజీ 'పచ్చి అబద్ధం'. అది జె.ఎన్.యు. అసలు కాదు.. జామియాకు చెందిన లేడీస్ హాస్టల్. ఏ ప్రాంతానికి చెందిన వారైనా, ఏ మతానికి చెందిన వారైనా అక్కడ ఉండొచ్చు.

Claim Review:Fact Check : ముస్లిం విద్యార్థులు అక్కడ ఉచితంగా ఉండొచ్చా..?
Claim Fact Check:false
Next Story